కేంద్రం మరో ప్యాకేజీ ప్రకటించబోతోంది. రెండో దశ కరోనా కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించడానికి.. ప్రజల ఆర్థిక స్థితిగతుల్ని మార్చడానికి ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు.. మీడియాకు లీక్ చేశాయి. ఈ సమాచారం ఇప్పుడు సామాన్యుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. నిజానికి కేంద్రం ప్యాకేజీ ఇస్తే అందరూ సంతోషపడాలి.. కానీ మోడీ సర్కార్ మార్క్ ప్యాకేజీ అంటే.. ప్రజల్ని పిండేసుకోవడమే. మొదట ప్రకటించిన ఆత్మనిర్భర్ ప్యాకేజీతో ప్రజలకు పైసా ఒరిగింది ఏమీ లేకపోయినా… ఆ ప్యాకేజీ నిధుల సేకరణ పేరుతో పెద్ద ఎత్తున పన్నులు పెంచారు. ఇప్పుడు ఆ భారం ప్రజలపైనే పడింది.
కరోనా వేవ్ మొదటి దశలో లాక్ డౌన్ ప్రకటించినందుకు .., ప్రజల్ని ఆదుకోవాలని రూ. ఇరవై లక్షల కోట్లతో ప్యాకేజీని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఐదు రోజుల పాటు సీరియల్‌గా ప్రకటించారు. ఆ ప్యాకేజీ ప్రకటించిన కారణంగా.. పెట్రోల్ రేట్లను.. రూ. 70 నుంచి రూ. 100కు ఏడాదిలోనే తెచ్చేశారు. ఎందుకంటే.. ఆ ఆత్మనిర్భర్ ప్యాకేజీకి నిధుల కోసం… దీనిపైనే ఆధారపడుతున్నామని కేంద్రం నిర్మోహమాటంగా ప్రకటించింది. దీంతో … రూ. ఇరవై లక్షల కోట్ల ప్యాకేజీని ప్రజలకు ఇస్తున్నారా.. ప్రజల నుంచి వసూలు చేస్తున్నారా.. అన్న సెటైర్లు సోషల్ మీడియాలో బాగానే పేలాయి. ఇప్పుడు రెండో దశ లాక్ డౌన్ ను కేంద్రం ప్రకటించకపోయినా … దాదాపుగా అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. దీంతో మరో ప్యాకేజీ ప్రకటించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రం అధికారికంగా ప్రకటించకపోయినా… బిజినెస్ మీడియాకు లీక్ ఇచ్చింది.
ఇతర దేశాల్లో ప్రజలను ఇంట్లోనే ఉంచేలా చేసినందుకు ప్రభుత్వాలు పరిహారాలు ఇచ్చాయి. కానీ ఇండియాలో మాత్రం… రేషన్ బియ్యాన్ని మాత్రం ఉచితంగా ఇచ్చి… ప్యాకేజీని ప్రకటించారు. ఆ ప్యాకేజీలో మెజార్టీ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లభించలేదు. చివరికి వివిధ పారిశ్రామిక సంస్థలకు అప్పులు ఇస్తామని చెప్పినా వాటికి సవాలక్ష నిబంధనలు పెట్టడంతో చాలా వరకు అమలుకు నోచుకోలేదు. కానీ పన్నులు మాత్రం ప్రజల నడ్డి విరుస్తున్నాయి. నిజానికి ఈఎంఐల వాయిదా అయినా ప్రజలకు కాస్త ఉపయోగపడుతుందని అనుకుంటే అదీ లేదు. వడ్డీ మీద వడ్డీ వేసి నడ్డి విరిచారు. చివరికి సుప్రీంకోర్టు ఆదేశించినా.. తూ…తూ మంత్రంగా పూర్తి చేశారు. ఇప్పుడు మరోసారి కేంద్రం ప్యాకేజీ అంటే.. ఈ సారి పెట్రోల్, డీజిల్ ధర రూ. 150కి చేరుకోవాల్సిందేనని సామాన్యుడు భయపడే పరిస్థితి.