విద్యుత్ ఒప్పందాల విషయంలో లంచాలు ఇచ్చినట్లుగా అమెరికా దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. ఆ వ్యవహారం మొత్తం భారత్‌లోనే జరిగింది. ఈ అంశంపై ఇంకా భారత ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు. వైట్ హౌస్ స్పందించింది. దర్యాప్తు సంస్థలు ఖచ్చితమైన సమాచారంతోనే ముందుకెళ్తాయని.. ఇలాంటి పరిస్థితుల్ని రెండు దేశాలు సమర్థంగా ఎదుర్కొంటాయని ప్రకటించింది. కానీ భారత్ వైపు నుంచి అలాంటి స్పందన రాలేదు. ఆ కేసు విషయంలో ఏం చేస్తారో స్పష్టత లేదు.
అమెరికా కేసుపై ఇప్పటి వరకూ స్పందించని కేంద్రం
అదానీ తనపై..తన కంపెనీపై వచ్చిన ఆరోపణల్ని తిరస్కరించారు. కానీ అమెరికా న్యాయస్థానాల నుంచి ఆయన తప్పించుకోవడం అంత తేలిక కాదు. భారత్ – అమెరికా మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉంది. అయితే అదానీని అంత తేలికగా అప్పగించే అవకాశాలు లేవు. మాములుగా అయితే ఇంత తీవ్రమైన అవినీతి కేసు బయటపడినప్పుడు అమెరికా దగ్గర ఆధారాలు తీసుకుని దర్యాప్తు చేస్తామని.. అవినీతికి పాల్పడినవారిని వదిలే ప్రసక్తే లేదని ప్రకటన చేయాల్సి ఉంది. అలాంటి ప్రకటన చేయలేదు.
నేరుగా అమెరికా ఎఫ్బీఐనే విచారణ – ఎదురుదాడి కూడా కష్టమే
అదానీకి బీజేపీ పెద్దలు సన్నిహితులు అన్న ప్రచారం ఉంది. హిండెన్‌బెర్గ్ తో సహా ఎలాంటి వివాదాలు వచ్చినా వాటన్నింటినీ భారత్‌పై దాడిగానే వాదిస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా అలా అసువుగా చెప్పేయవచ్చు కానీ..అటు వైపు నేరుగా ఇన్వాల్వ్ అయింది అమెరికా ఎఫ్‌బీఐ. తమ దేశంపై కుట్ర చేస్తున్నారని అమెరికాను అంత వేగంగా నిందించలేరు. అందుకే అదానీ విషయంలో ఎలా వ్యవహరించాలా అన్నదానిపై ఆలోచిస్తూ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు.
పార్లమెంట్లో ప్రకటన చేయక తప్పని పరిస్థితి!
పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాలు ఖచ్చితంగా ప్రశ్నిస్తాయి. అందులో సందేహం లేదు. సభను వాయిదా వేసి .. తప్పించుకుందామని కేంద్రం అనుకుంటే ప్రజల దృష్టిలో దోషిగా నిలబడతారు. ప్రతిపక్షం ఇప్పుడు బలంగా ఉంది. అదానీకి వ్యవహారంలో విచారణ జరిపిస్తారా లేదా.. ఏకపక్షంగా మద్దతుగా ఉంటారా అన్నది పార్లమెంట్ సమావేశాల్లో తేలిపోయే అవకాశం ఉంది.