పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్. అంటే కేంద్ర ప్రభుత్వ ఆస్తి. కానీ నిర్మాణ బాధ్యత మాత్రం ఏపీ సర్కార్‌పై ఉంది. అలా ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా కాంట్రాక్టర్లను మార్చేసి.. ప్లాన్లు మార్చేసి.. ఎత్తిపోతల పథకాలకు ఆమోద ముద్ర వేసి.. .. అంతా మా ఇష్టం అనుకున్నట్లుగా చేస్తామంటే కేంద్రం ఎందుకు ఊరుకుంటుంది..?. ఇప్పుడు అదే జరుగుతోంది. పోలవరం విషయంలో కేంద్రం నుంచి పైసా రావడంలేదు. అయినా ఏపీ సర్కార్ మాత్రం.. ఈ తరహా చర్యలు ఆపడం లేదు.
జాతీయ ప్రాజెక్టుపై ఇష్టారీతిన రాష్ట్రం నిర్ణయాలు..!
పోలవరానికి సంబంధించిన పనులన్నీ పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ చేతుల మీదుగా సాగాలి.కానీ ప్రభుత్వం అన్నీ ఏకపక్షంగా చేసుకుంటూ వెళ్తోంది. నిర్ణయాలు తీసుకుటోంది. మొదట రివర్స్ టెండరింగ్‌కు వెళ్లినప్పుడు పీపీఏ అనుమతి తీసుకోలేదు. దీంతో పీపీఏ ఆ రివర్స్ టెండరింగ్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పనుల ఖర్చు తగ్గించామంటూ ప్రభుత్వం సమర్థించుకునే ప్రయత్నం చేసింది. రూ.780 కోట్లను ఆదా చేశామంటూ చెప్పుకొచ్చారు. తాజాగా రూ.1656.61 కోట్లను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. అందులోనే ఈ అంచనాల పెంపు కేంద్ర జల సంఘం ఆమోదానికి లోబడి ఉంటుందని జలవనరుల శాఖ సోమవారం జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొంది. అంటే ఆమోదం లేకుండానే ఉత్తర్వులిచ్చేశారన్నమాట.
అంచనాలు పెంచితే సంబంధం లేదని రివర్స్‌లోనే చెప్పిన కేంద్రం..!
వాస్తవానికి పోలవరం సాగు నీటి ప్రాజెక్టుకు రివర్స్ టెండరుకు వెళ్తున్నప్పుడు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. నిర్మాణ వ్యయం పెరగడంతో సహా .. నిర్ణీత లక్ష్యం మేరకు ప్రాజెక్టును పూర్తి చేయలేమని కేం ద్రం వెల్లడించింది. నవయుగ సంస్థ వేగంగా … నాణ్యతతో పనులు చేపడుతున్నందున .. రివర్స్ టెండరింగ్ కు వెళ్లకుండా ఉంటే .. 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయవచ్చని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. అంచనా వ్యయం పెరిగితే రాష్ట్రమే భరిం చాలని కూడా జగన్ సర్కారుకు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ తేల్చిచెప్పింది. అయినా ఇప్పుడు… కేంద్రం రీఎంబర్స్ చేస్తుందని.. జీవో ఇచ్చారు.తాజాగా అంచనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం అంగీకరించే పరిస్థితి లేదు.
ఇప్పుడు ప్రజాధనం దోచిపెట్టడానికే కొత్త కథలు..!
పోలవరం ఖర్చును రీఎంబర్స్ చేయడానికే ప్రభుత్వం కొర్రీలు పెడుతోంది.. సవరించిన అంచనాలను ఆమోదించడానికి అంగీకరించడం లేదు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఓ జీవో ఇచ్చినంత మాత్రాన.. కేంద్రం పెంచిన నిధులు ఇవ్వదు. రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాలి. ఎందుకంటే… కాంట్రాక్టర్‌కు చెల్లింపులు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. ఆ తర్వాత కేంద్రం రీఎంబర్స్ చేస్తుంది. ఇప్పటికే పోలవరం కోసం చేసిన ఖర్చులంటూ పంపిన బిల్లులపై అనేక కొర్రీలు పెట్టి.. తగ్గించి ఇస్తోంది. ఇప్పుడు తమంతట తాముగా పెంచుకుని ఖర్చు పెట్టేసుకున్నామని చెబితే కేంద్రం పైసా కూడా ఇవ్వదు. ఆ నిధులను రాష్ట్ర ప్రజల నుంచి పన్నుల రూపంలోనే వసూలు చేసి.. కాంట్రాక్టర్‌కు కట్టాలి. అంటే… పోలవరం రివర్స్ టెండరింగ్ వ్యవహారం మొత్తం చివరికి ప్రజాధనానికి టెండర్ పెట్టడం అన్నట్లుగా మారిపోయిందన్నమాట.