ఏపీ ప్రజల అస్థిత్వ ప్రతీకగా ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గేలా కనపడుతోంది. ఎన్డీయేలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉండటంతో పాటు ప్రైవేటీకరణను టీడీపీ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో… కేంద్ర ఉక్కుశాఖ మంత్రి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు రాబోతున్నారు.
కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి బుధవారం రాత్రి వైజాగ్ రాబోతున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యలు, ఆర్థికంగా గాడిలో పడాలంటే ఏం చేయాలి అన్న అంశాలపై ఉన్నతాధికారులతో పాటు అక్కడున్న వారితో గురువారం మంత్రి చర్చించబోతున్నారు.
పెట్టుబడుల ఉపసంహరణ ప్రకటన తర్వాత కేంద్రమంత్రి తొలిసారి స్టీల్ ప్లాంట్ కు రాబోతున్నారు. అయితే, స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో కలపాలని ఉద్యోగులు కోరుతుండగా… ప్లాంట్ నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెప్పాలని కూటమి ఎన్నికల్లో హామీ ఇచ్చింది. దీంతో కేంద్రమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
గురువారం చర్చల తర్వాత హైదరాబాద్ లోని ఎన్.ఎం.డీ.సీ అధికారులతో కేంద్రమంత్రి కుమారస్వామి చర్చలు జరపబోతున్నారు. ఎన్.ఎం.డీ.సీకి ఐరన్ ఓర్ గనులున్న నేపథ్యంలో… స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా కనపడుతోంది.