పార్లమెంటులో ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంపై వాడీవేడీ చర్చల్లో బిజీబిజీగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారు. ఈ సమయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కాసేపు భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాలపాటు ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానికి ఒక వినతి పత్రం ఇచ్చారు ఏపీ సీఎం. దీనిలో ప్రధానంగా ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ తోపాటు, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన పన్నుల రాయితీలు కల్పించాలని కూడా కోరారు. పదేళ్లపాటు జీఎస్టీ మినహాయింపు, ఆదాయపన్ను మినహాయింపు కోరారు. రెవెన్యూ లోటు పూడ్చడం కోసం దాదాపు రూ. 23 వేల కోట్లు ఇవ్వాలని అడిగారు. పోలవరం కోసం ఖర్చు చేసిన రూ. 5 వేల కోట్ల నిధులను విడుదల చేయాలన్నారు. దీంతోపాటు, పీపీయే ఒప్పందాలు, అమరావతి నిర్మాణం అంశాలపై కూడా ఈ భేటీలో ప్రధానితో జగన్మోహన్ రెడ్డి చర్చించినట్టు సమాచారం.
నిజానికి, వీటిలో ఇప్పటికే ప్రత్యేక హోదాపై కేంద్రం చాలా స్పష్టత ఇచ్చేసింది. బడ్జెట్ సందర్భంగా పార్లమెంటులో నిర్మలా సీతారామన్, ఆ తరువాత రాష్ట్రానికి వచ్చిన కొందరు జాతీయ నేతలు హోదా ఇవ్వలేం అని స్పష్టంగానే చెప్పేశారు. ఇక, పరిశ్రమలకు జీఎస్టీ మినహాయింపులు, పన్నుల రాయితీలపై కూడా కేంద్రం ఇప్పటికే స్పష్టత ఇచ్చేసింది. జీఎస్టీ అనేది ఒక రాష్ట్రం కోసం విధానాలు మార్చలేమనీ, దేశంలో అమలు జరుగుతున్న సంక్షేమ పథకాల ద్వారానే ఏపీకి లబ్ధి జరుగుతుందనీ, ప్రత్యేకంగా అంటూ ఏమీ ఉండదనీ ఇటీవలే కేంద్రమంత్రి నితిన్ గట్కరీ కూడా చాలా స్పష్టంగా చెప్పేశారు. సో.. సీఎం జగన్ ఇచ్చిన వినతి పత్రంలో కీలక అంశాలపై ఇప్పటికే కేంద్రం సమాధానం ఇచ్చేసినట్టే లెక్క. ఇక, మిగిలినవి పోలవరం బిల్లులు, రాజధాని అమరావతి నిర్మాణ నిధులు. వాటిపై కూడా కేంద్రం ఇప్పటికే మీనమేషాలు లెక్కిస్తోంది. పోలవరం నిర్మాణం ఇప్పటికీ రాష్ట్రం చేతుల్లోనే ఉందనీ, ఆలస్యానికి కారణం రాష్ట్రమే అన్నట్టుగా భాజపా నేతలు మాట్లాడుతున్నారు.
పీపీయేల రద్దు, పోలవరం పనుల్లో రివర్స్ టెండరింగ్… వీటిపై కేంద్రం నుంచి కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ప్రధానితో భేటీలో ఈ అంశాలు కూడా ప్రస్థావనకు వచ్చినట్టు సమాచారం. అయితే, బుధవారం కూడా సీఎం పర్యటన ఢిల్లీలో కొనసాగుతుంది కాబట్టి, ప్రధానితో చర్చల సారాంశాన్ని ఆయన ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించే అవకాశం ఉంటుంది. ఏదేమైనా, ప్రధానికి ఇచ్చిన వినతి పత్రంలో ఏపీ సీఎం ప్రస్థావించిన కొన్ని కీలక అంశాలపై ఇప్పటికే కేంద్రం స్పష్టత ఇచ్చేసినట్టే. మరోసారి గుర్తు చేసిన ప్రత్యేక హోదాపై మరోసారి స్పందన ఉంటుందా లేదా అనేది చూడాలి.