కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.1800 కోట్లు మంజూరు చేసింది. కానీ రెవెన్యూ లోటు భర్తీకి ఇంకా మరో రూ. 13,000 కోట్లు విడుదల చేయవలసి ఉంది. విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర రెవెన్యూ లోటును భర్తీ చేయవలసిన బాధ్యత కేంద్రంపైనే ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుబరా ఖర్చులను చూసి కేంద్రం కూడా చాలా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం కేంద్రప్రభుత్వం నేరుగా చెప్పనప్పటికీ, భాజపా సీనియర్ నేత పురందేశ్వరి ద్వారా చాలా స్పష్టంగానే చెప్పించిందని భావించవచ్చును. కానీ, తెదేపా ఆమె మాటలను సీరియస్ గా తీసుకోకుండా తిరిగి ఆమెపై ఎదురుదాడి చేసింది. ఆమె మాటలు అనధికారమైనవి కనుక వాటిని పట్టించుకోకపోయినా, ఇటీవల కాగ్ కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పు పట్టింది. దాని అభిప్రాయాలను కూడా తెదేపా ప్రభుత్వం పట్టించుకోకూడదని అనుకొంటే కేంద్రం నుంచి ఆర్ధిక సహాయం ఆశించి ప్రయోజనం ఉండదు. “రెవెన్యూ లోటు భర్తీకి మిగిలిన సొమ్ముని కూడా విడుదల చేస్తే తప్ప రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మెరుగుపడదు..రాష్ట్రం ఇంకా ఆర్ధిక ఇబ్బందులలో కూరుకుపోతుందని” గట్టిగా వాదించలేని పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అది స్వయంకృతాపరాధమేనని చెప్పక తప్పదు.
ముఖ్యమంత్రి మంత్రులను, అనేకమంది అధికారులను వెంటబెట్టుకొని ప్రత్యేక విమానాలలో తరచూ విదేశీ యాత్రలు చేస్తుండటం, తాత్కాలిక పనులు, ప్రాజెక్టుల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తుండటం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు భారీగా జీతాల పెంపు, వారికి ఖరీదయియన్ ఐ-ఫోన్లను బహుమతులుగా పంచిపెట్టడం వంటివన్నీ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గురించి, ప్రభుత్వ వ్యవహార శైలి గురించి తప్పుడు సంకేతాలు పంపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి నిజంగా బాగోలేకపోయినట్లయితే మరి ఇటువంటి దుబారా ఖర్చులు ఎందుకు చేస్తున్నట్లు అని సామాన్య ప్రజలకి కూడా సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరి వేలకోట్లు మంజూరు చేస్తున్న కేంద్రప్రభుత్వం దాని గురించి రాష్ట్ర ప్రభుత్వాన్ని సంజాయిషీ కోరకుండా ఉంటుందా? దానికి సరయిన సంజాయిషీ చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం నిదుల కోసం కేంద్రాన్ని గట్టిగా నిలదీసి అడుగగలదా? రాష్ట్ర ఆర్ధిక సమస్యలకు రాష్ట్ర విభజన ప్రధాన కారణమయితే, కేంద్రం నుంచి అందుతున్న నిధులను సక్రమంగా వినియోగించుకోకపోవడం కూడా ఇప్పుడు మరో కారణంగా కనబడుతోంది. కనుక ఈ విషయంలో కేంద్రప్రభుత్వం వేలెత్తి చూపించే పరిస్థితి తెచ్చుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం తన తప్పులను సరిదిద్దుకొంటే అందరికీ మంచిది.