మీరో సంగతి గమనించారా? ”ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికల నాటికి భారతీయ జనతా పార్టీ అత్యంత బలమైన పార్టీగా ఎదుగుతుంది” ”సొంతంగానే రాష్ట్రంలో అన్ని స్థానాలకు పోటీచేస్తుంది” ”సొంతంగా అధికారంలోకి వచ్చే స్థితికి చేరుకుంటుంది” వంటి వివాదాస్పదమైన ప్రకటనలు ఏపీకి చెందిన భాజపా నాయకులనుంచి వినిపించి ఇప్పటికి కొన్ని నెలలు గడచిపోతున్నాయి. ఏపీ సంకీర్ణ ప్రభుత్వంలోభాజపా భాగస్వామిగా అధికారం చెలాయిస్తూ ఉన్నప్పటికీ.. చంద్రబాబు అంటే కిట్టని, అదే పార్టీలోని కొందరు నేతలు గతంలో చాలా దూకుడుగా.. తెదేపా వ్యతిరేక, భాజపా అనుకూల ప్రకటనలతో రెచ్చిపోయిన సంగతి అందరికీ గుర్తుండచ్చు. అలాగే.. ఏపీలో భాజపా బలం పెంచేస్తాం అనే ప్రకటనలు కూడా తగ్గిపోయాయి. ఈ పరిణామం వెనుక చంద్రబాబు నాయుడు జోక్యం ఉన్నదని అంతా అంటూ ఉంటారు. నిజానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా.. చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడే ఏపీ నాయకులకు తలంటు పోశారని, అలాంటి వివాదాలు సృష్టించవద్దని క్లాస్ పీకారని గతంలో వార్తలు వచ్చాయి.
ఆ నేపథ్యంలో రాష్ట్ర భాజపా నాయకులు కోరినంత మాత్రాన.. ఇక్కడ పార్టీని మరింత బలోపేతం చేసే కార్యక్రమాలకు కేంద్ర నాయకత్వం సహకరిస్తుందా, అలాంటి ప్రయత్నాలను చంద్రబాబు సాగనిస్తాడా? అని తాజాగా సందేహాలు వినిపిస్తున్నాయి.
ఎందుకంటే అమిత్‌షా ఇప్పుడు మళ్లీ పార్టీకి నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ సందర్భంగా ఏపీలోని మంత్రి మాణిక్యాల రావు, ఏపీ భాజపాకు అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉన్నదని చెప్పుకుంటున్న కన్నా లక్ష్మీనారాయణ, మరికొందరు నేతలు వెళ్లి ఢిల్లీలో ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా.. ఏపీలో పార్టీని బలోపేతం చేయడానికి ఫిబ్రవరిలో తమ రాష్ట్రంలో పర్యటించాల్సిందిగా కన్నా లక్ష్మీనారాయణ అమిత్‌ను కోరడం కూడా జరిగింది. అయితే అమిత్‌షా రావడం మాత్రం అసాధ్యం అని, ఈ ప్రయత్నాలను చంద్రబాబు సాగనివ్వడని, ఏపీలో భాజపాను తమకు ఉపయోగపడే ఎలిమెంట్‌గా వాడుకోవడం తప్ప, ప్రధాన పార్టీగా ఎదగనివ్వడని కొందరు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో.. ఈ ఏడాది తమిళనాడు వంటి అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో.. ఆయా ప్రాంతాల రాజకీయాల మీద దృష్టిపెట్టడం తప్ప.. ఏపీ వ్యవహారాలు చూసేంత, ఇక్కడ పర్యటించేంత , శ్రద్ధ పెట్టేంత ఖాళీ అమిత్‌షాకు ఉండకపోవచ్చునని కూడా పలువురు విశ్లేషిస్తున్నారు.