ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి… ఆపద్దర్మ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోన్ చేశారు. ఈ నెల 30వ తేదీన… తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నానని.. ఆ కార్యక్రమానికి రావాలని స్వయంగా ఆహ్వానించారు. తనకు ఆశీస్సులు అందజేయాలని కోరారు. విజయం సాధించినందుకు జగన్కు చంద్రబాబు అభినందనలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి… ఇలా.. చంద్రబాబును ఆహ్వానిస్తారని టీడీపీ వర్గాలు కూడా ఊహించలేదు. ప్రోటోకాల్ ప్రకారం.. ఏదో ఓ అధికారితో ఆహ్వానపత్రమో.. మరో విధంగానో ఆహ్వానం పంపుతారని.. ఆనుకున్నారు కానీ..నేరుగా జగన్మోహన్ రెడ్డినే ఫోన్ చేసి… ఆహ్వానించడం.. టీడీపీ వర్గాల్లోనే ఆసక్తి రెకెత్తిస్తోంది.
టీడీపీ అధినేతను.. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ… రాజకీయ ప్రత్యర్థిగా చూడలేదు. ఓ వ్యక్తిగత ద్వేషంతో రాజకీయాలు చేస్తున్నట్లుగానే ఆయనపై విమర్శలు చేసేవారు. వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా.. ఏక వచనంతో సంబోధిస్తూ విమర్శలు చేసేవారు. జగన్ చేసే విమర్శల తరహాలోనే… ఇతర నేతలు పోటీ పడేవారు. రోజా లాంటి నేతలైతే.. “అసలు కాల్ మనీ సీఎం… కామ సీఎం” అంటూ.. సాక్షాత్తూ అసెంబ్లీలోనే చెలరేగిపోయారు. అదే సమయంలో… ప్రభుత్వం తరపున ఏ కార్యక్రమం చేపట్టినా… జగన్కు ఆహ్వానం వెళ్లేది. ఆయన ఎప్పుడూ హాజరు కాలేదు. 2014లో చంద్రబాబు ప్రమాణస్వీకారానికి కూడా హాజరు కాలేదు. అమరావతి శంకుస్థాపనకు కూడా హాజరు కాలేదు.
అయితే.. చంద్రబాబు.. రాజకీయాల్లో రాటుదేలిపోయారు. అలాంటివన్నీ కామనే కాబట్టి.. తను అనుకున్నదే చేస్తారు. జగన్మోహన్ రెడ్డి… పిలిచారు కాబట్టే… చంద్రబాబు వెళ్లే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ప్రమాణస్వీకార కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరవుతున్నారు. అయితే.. చంద్రబాబు వెళ్తారా లేదా.. అన్నదానిపై.. ఇప్పుడే ఓ అభిప్రాయానికి రాలేమని.. టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే.. అది ఓ బహిరంగ కార్యక్రమంలా నిర్వహిస్తున్నారు. వైసీపీ నేతలు… వారి కార్యకర్తల వ్యవహారశైలి చాలా తేడాగా ఉంటుంది. వీటన్నింటినీ బేరీజు వేసుకుని.. చంద్రబాబు ప్రమాణస్వీకారానికి వెళ్తారా.. లేదా.. శుభాకాంక్షలు చెప్పి సరిపెడతారా.. అన్నది ఒకటి, రెండు రోజుల్లో తెలిసిపోయే అవకాశం ఉంది.