హైదరాబాద్ వేదికగా ఈనెల 15 నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తోంది కేసీఆర్ సర్కారు. దీనికోసం భారీ ఏర్పాట్లు చేసింది. నగరమంతా పెద్ద సంఖ్యలో ప్రచార పోస్టర్లు, ఫ్లెక్సీలు పెట్టారు. ఈ సభలను తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వివిధ దేశాల నుంచి తెలుగు అభిమానులను ఆహ్వానించింది. రచయితలు, కవులు, భాషాభిమానులు… ఇలా ఇప్పటికే చాలామందికి ఆహ్వానాలు పంపింది. అయితే, ఇంత ఘనంగా నిర్వహిస్తున్న ఈ ప్రపంచ మహాసభలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఆహ్వానిస్తారా లేదా అనేది ఇంకా నిర్వాహకులకే స్పష్టత లేదని సమాచారం!
తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయినా తెలుగువారు కలిసిమెలిసి ఉండాలని ఇద్దరు ముఖ్యమంత్రులూ చాలా సందర్భాల్లో అంటుంటారు. రాజకీయంగా చూసుకున్నా కేసీఆర్, చంద్రబాబు మధ్య సంబంధాలు గతం కంటే ఎంతో మెరుగ్గా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే… తెరాస, టీడీపీ దగ్గరయ్యే పరిస్థితులు కూడా ఈ మధ్య కనిపించాయి. టీడీపీని దగ్గర చేసుకోవాలనే ప్రయత్నం కూడా కేసీఆర్ తరఫు నుంచే కనిపించింది. సరే, రాజకీయాలు పక్కనపెడితే.. ఇది తెలుగు భాషకు సంబంధించిన కార్యక్రమం కాబట్టి, సాటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రా ముఖ్యమంత్రిని ఆహ్వానించాల్సిన అవసరమైతే ఉంది. కానీ, ఈ సభలకు ఆంధ్రా నుంచి ప్రాతినిధ్యం చాలా తక్కువగానే ఉండబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఆంధ్రా నుంచి 15 మంది కవులు, రచయితల్ని మాత్రమే ఇప్పటివరకూ టీ సర్కారు ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఇక, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం విషయంలో కూడా ఎవ్వరూ స్పందించడం లేదని అంటున్నారు.
ఏపీ సీఎంను ఆహ్వానిస్తామని గతంలో కేసీఆర్ చెప్పారు. కానీ, ఇప్పుడు ఆయన మనసు మార్చుకున్నట్టు చెబుతున్నారు. ఈ సమావేశాలకు చంద్రబాబును ఆహ్వానించాలా వద్దా అనే అంశంపై కేసీఆర్ కొంతమంది అభిప్రాయాలు తీసుకున్నారనీ, కొన్ని వర్గాల నుంచి ఫీడ్ బ్యాక్ కూడా సేకరించారనీ, దాని ఆధారంగానే ఈ అంశం గురించి మాట్లాడటం లేదని చెబుతున్నారు. ఈ సభలకు ఏపీ సీఎంను ఆహ్వానించకపోవడం వల్ల వచ్చే నష్టమేమీ లేదన్న లెక్కల్లో ఉన్నారట! ఇప్పటివరకూ ఉన్న సమాచారం మేరకు.. చంద్రబాబు ఆహ్వానం ఉండదనే తెలుస్తోంది. భాషాపరంగా చూసుకుంటే… తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాల్లో అధికారిక, వ్యవహారిక భాష తెలుగే కదా. కాబట్టి, చంద్రబాబును ఆహ్వానించాలనే అభిప్రాయం కొంతమందిలో ఉందనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయినా కలిసిమెలిసి ఉండాలంటే… ఇలాంటి సందర్భాలనే వేదికలుగా మార్చుకోవాలి. మహాసభల ప్రారంభానికి మరో రెండ్రోజులు సమయం ఉంది కాబట్టి… కేసీఆర్ మనసు మార్చుకునే అవకాశం ఉందో లేదో మరి!