శాసనమండలిలో మనకే మెజార్టీ ఉందని జగన్ రెడ్డి గొప్పలు పోతున్నారు కానీ.. ఈ మండలి పీక పిసకాలని ఆయన చేసిన ప్రయత్నాన్ని ఎవరూ మర్చిపోవడం లేదు. మండలి దండగ అని… ఏటా అరవై కోట్లు ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరేనని.. అసెంబ్లీలోనే చాలా మంది డాక్టర్లు, లాయర్లు.. .వివిధ రంగాల నిపుణులు ఉన్నారని ఇక మండలి అవసరం ఏముందని చెప్పి రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. 2020లో రాజధాని బిల్లును సెలక్ట్ కమిటీకీ పంపారని ఈ తొందరపాటు పనికి పాల్పడ్డారు.
మళ్లీ రెండేళ్లు కాక ముందే కేంద్రం.. పార్లమెంట్ ఎక్కడ బిల్లు పాస్ చేస్తుందోనని భయంతో మండలి రద్దుచేయడం లేదని మరో తీర్మానం చేశారు ఇప్పుడు అదే మండలి సభ్యులతో పోరాటం చేస్తామని జగన్ రెడ్డి చెబుతున్నారు. కానీ ఇప్పుడు తేడా వస్తే మండలిని రద్దు చేయించడానికి చంద్రబాబుకు చాయిస్ ఉంది. కేంద్రంలో ఆయన కీలక పాత్రలో ఉన్నారు. మండలిని రద్దు చేయించడం పెద్ద విషయం కాదు. కానీ చంద్రబాబు జగన్ రెడ్డిలా ఆలోచించరు.
నిజానికి శాసనమండలి అంత పవర్ ఫుల్ కాదు. ఏపీ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును ఒక్క సారి మాత్రమే తిరస్కరించగలదు. రెండో సారి ప్రవేశపెడితే చాలు ఆమోదం పొందినట్లే. రెండో సారి తిరస్కరించినా ప్రభుత్వం ముందుకెళ్లగలదు. రాజధాని విషయంలో అప్పటి చైర్మన్ షరీఫ్.. మూడు రాజధానుల బిల్లు ను సెలక్ట్ కమిటీకి పంపారు. అక్కడే సమస్య వచ్చింది. తిరస్కరిస్తే.. మరోసారి ఏదో విధంగా బిల్లును పాస్ చేసుకునేవారు. కానీ సెలక్ట్ కమిటీలో ఉంది కాబట్టి ఏమీ చేయలేకపోయారు. కానీ కొంత విరామం తర్వాత మరోసారి అసెంబ్లీలో ఆమోదింప చేసుకుని మూడు రాజధానుల బిల్లును గవర్నర్ తో గెజిట్ కూడా ఇప్పించుకున్నారు. కానీ హైకోర్టు కొట్టి వేసింది. అంటే రాజధానుల విషయంలో జగన్ చేయాలనుకున్నది చేశారు. మండలి అడ్డమేం కాలేదు.