హైదరాబాద్: నంద్యాల ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు భూమా నాగిరెడ్డి తెలుగుదేశంలోకి చేరటం ఖరారయిపోయింది. నాగిరెడ్డి, ఆయన కుమార్తె, ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసేందుకు హైదరాబాద్ నుంచి విజయవాడ బయలుదేరారు. ఈ సాయంత్రం 7 గంటలకు చంద్రబాబుతో నాగిరెడ్డి అపాయింట్మెంట్ ఫిక్స్ అయిఉంది. మరోవైపు కర్నూలు జిల్లాకే చెందిన టీడీపీ నాయకులు శిల్పా సోదరులు ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. వారు ఇవాళ మీడియాతో మాట్లాడుతూ, భూమా చేరికను ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని చెప్పారు. భూమా చేరికతో తమ అనుచరులు, కార్యకర్తలు ఇబ్బంది పడతారని, వారికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. అయితే పెద్దాయన(చంద్రబాబు) మాట తమకు శిరోధార్యమన్నారు. వైసీపీలోకి వెళతామని జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని, తాము టీడీపీని వీడబోమని చెప్పారు. తమ సాధక బాధకాలు ముఖ్యమంత్రికి చెప్పుకుంటామని అన్నారు. శిల్పా మోహన్ రెడ్డి 2014 ఎన్నికల్లో నంద్యాలలో భూమానాగిరెడ్డి చేతిలోనే పరాజయం పాలయిన సంగతి తెలిసిందే. ఈ రెండు వర్గాలకూ చంద్రబాబు ఈ సాయంత్రం రాజీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, కడప ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కూడా భూమాతో పాటే సైకిల్ ఎక్కబోతున్నట్లు అభిజ్ఞవర్గాల భోగట్టా.