దేశంలోనే అత్యంత అనుభవజ్ఙడినైన నాయకుడిని నేను, ప్రపంచానికే పాఠాలు చెప్పాను లాంటి మాటలు చంద్రబాబు నోటి వెంట తరచుగా వస్తూ ఉంటాయి. నిజంగా కూడా ఇప్పుడు దేశంలో ఉన్న నాయకుల్లో యాక్టివ్‌గా ఉన్నవాళ్ళలో చంద్రబాబు అత్యంత అనుభవజ్ఙుడు అని అనుకుందాం. ఆంధ్రప్రదేశ్ ఓటర్లు కూడా ఆ అనుభవం కొత్త రాష్ట్రానికి ఉపయోగపడుతుందనే గెలిపించారు. కానీ చంద్రబాబు అనుభవం ఎపికి ఉపయోగపడుతోందా? విభజన సమయంలో ఒక స్టాండ్ తీసుకోలేక విఫల రాజకీయాన్ని నడిపించిన చంద్రబాబు తనకు ప్రత్యర్థులైన కాంగ్రెస్, వైకాపాలను దోషులుగా నిలబెట్టడంలో మాత్రం సక్సెస్ అయ్యాడు. విభజనలో కాంగ్రెస్‌తో సమాన పాత్రను పోషించిన బిజెపిని నిర్దోషిగా నిలబెట్టడంలో సక్సెస్ అయ్యాడు. అలాగే టిడిపిని కూడా. ఎలా అయితేనేం ఎన్నికల్లో గెలవడం వరకూ చంద్రబాబు అనుభవం టిడిపి, బిజెపిలకు అద్భుతంగా పనికొచ్చింది.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచీ మాత్రం చంద్రబాబు అనుభవం రాష్ట్రాభివృద్ధికి ఎంతలా ఉపయోగపడుతోంది అంటే మాత్రం ఆలోచించాల్సిన విషయమే. పెట్టుబడుల కోసం దేశదేశాలు తిరగడం, రాజధాని రైతుల నిరసనలు కనిపించకుండా భూములు సమీకరించడం, వైకాపాను, జగన్‌ని అణచడంలో మాత్రం చంద్రబాబు వంద శాతం సక్సెస్ అయ్యాడు. కానీ తాను ఇచ్చిన హామీలు అమలు చేయడంలోనూ, ఆంధ్రప్రదేశ్‌కి నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలను అమలు చేయించడంలో మాత్రం చంద్రబాబు సక్సెస్ అవ్వలేకపోయాడు. ఇక అత్యంత అనుభవజ్ఙుడిని…ఎవ్వరికీ భయపడను అని కూడా చంద్రబాబు చెప్పుకుంటూ ఉంటాడు కానీ మోడీ దగ్గర తగ్గడానికి రాష్ట్ర అవసరాలే కారణం అనుకుందాం. మరి కెసీఆర్ దగ్గర ఎందుకు తగ్గుతున్నట్టు? రాష్ట్ర విభజనను పాపంగా అభివర్ణిస్తూ చంద్రబాబు మాట్లాడిన మాటలను కెసీఆర్‌తో సహా టీఆర్ఎస్ నేతలందరూ ఖండించారు. చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. కానీ చంద్రబాబుతో సహా టిడిపి నెతలెవ్వరూ కూడా టీఆర్ఎస్ నేతల విమర్శలకు సమాధానం ఇవ్వలేదు. పూర్తిగా మౌనంగా ఉండిపోయారు. కొన్ని గంటల్లోనే కెసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టేస్తా అని ఆవేశంగా మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడేమైనట్టు? ఎందుకు కెసీఆర్ దగ్గర కూడా తగ్గాల్సి వస్తోంది? రాజకీయ వ్యూహాలు, మీడియా మేనేజ్మెంట్ విషయంలో చంద్రబాబు అనుభవం ప్రతి రోజూ కనిపిస్తూనే ఉంది. కానీ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో మాత్రం ఆ స్థాయిలో కనిపించడం లేదు అన్న మాట వాస్తవం.