తెలుగుదేశం పార్టీ విజయం సాధించి ఉంటే… ఊరూవాడా.. ఎన్టీఆర్ జయంతి వేడుకలు అత్యంత అట్టహాసంగా జరిగి ఉండేవి. ఫలితాలు రాక ముందే మహానాడు రద్దు నిర్ణయం తీసుకున్నప్పటికీ…రెండో సారి అధికారం చేపట్టిన పార్టీగా.. టీడీపీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం… ఆకాశాన్ని అంటేది. కానీ పార్టీ పరాజయం పాలయింది. అది కూడా.. అత్యంత భారీగా…! ఇది టీడీపీ కార్యకర్తల ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా చేసింది. ఆ ప్రభావం ఎన్టీఆర్ జయంతి వేడుకలపై పడింది.
జయంతి వేడుకలపై పరాజయ ప్రభావం..!
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు… గుంటూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో.. జరిగిన ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో… సతీసమేతంగా పాల్గొన్నారు. పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు .. ఈ వేడుకల్లో పాల్గొన్నప్పటికీ.. ఎవరిలోనూ ఉత్సాహం కనిపించలేదు. అందరిలోనూ ఓ రకమైన నిరాశ కనిపించింది. టీడీపీ అధినేత… వచ్చిన వారందరికీ.. ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఓటమితో మనో ధైర్యం కోల్పోవద్దని… ఎన్టీఆర్ ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా.. మొక్కవోని ధైర్యంతో నిలబడి ఎన్నో విజయాలు సాధించారని గుర్తు చేశారు. టీడీపీ కోసం కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేశారని గుర్తు చేసుకున్నారు. ఐదేళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. రాష్ట్రాభివృద్ధి కోసం మనవంతు ప్రయత్నించాం. ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు..ఒక శక్తి, వ్యవస్థ. సమాజానికి సేవ చేయాలి, మార్పు తేవాలనే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారు. అదే స్ఫూర్తితో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు.
రోజూ మూడు గంటలు పార్టీ కార్యకర్తలకు అందుబాటులో..!
టీడీపీ అధినేత విశ్రాంతి తీసుకునే ఆలోచనలో లేరు. ఇక నుంచి రోజూ ఆయన టీడీపీ కార్యాలయానికి వచ్చి… పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై… కారకర్తలను అడిగి తెలుసుకోనున్నారు. రోజూ మూడు గంటల పాటు కార్యకర్తలకు.. అందుబాటులో ఉంటానని.. చంద్రబాబు ప్రకటించారు. గుంటూరు – విజయవాడ మధ్య.. . టీడీపీ కార్యాలయం కోసం.. భారీ భవనాన్ని నిర్మిస్తున్నారు. మరో ఐదారు నెలల్లో ఆ నిర్మాణం పూర్తి కానుంది. ఆ తర్వాత అక్కడ్నుంచే టీడీపీ వ్యవహారాలన్నీ సాగనున్నాయి. ఈ లోపు… గుంటూరులోని టీడీపీ ఆఫీసులోనే చంద్రబాబు… కార్యకర్తల కోసం అందుబాటులో ఉంటారు.
జగన్‌కు ఏడాది టైం ఇచ్చి… ఆ తర్వాత రంగంలోకి..!
ఆరు నుంచి ఏడాదిలోపు మంచి ముఖ్యమంత్రిగా నిరూపించుకుంటానని.. జగన్ చెబుతూండటంతో… తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా.. ఇప్పటి నుండే దూకుడుగా వెళ్లాలని అనుకోవడం లేదు. ఏడాది పాటు సమయం ఇద్దామని… ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే.. పోరాటం చేద్దామని నిర్ణయించుకున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు.. తాను బాధ్యతలు చేపట్టేటప్పుడు.. ఎలాంటి పరిస్థితి ఉందో… ఆర్థిక పరంగా ఇప్పుడూ అదే పరిస్థితి ఉందని.. చంద్రబాబు భావిస్తున్నారు. జగన్ ప్రకటించిన పథకాలు అమలు చేయాలంటే… రూ. 2లక్షల కోట్లు ఏడాదికి కావాలని… ఎలా అమలు చేస్తారో చూడాలని.. నిర్ణయించుకున్నారు. సంక్షేమానికి అంత ఖర్చుపెడితే.. ఇక అభివృద్ధి పనులకు ఏం చేస్తారోనని టీడీపీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.