గత ఎన్నికల్లో కాంగ్రెస్తో జత కట్టిన తెలుగుదేశం .. ఈ సారి బీజేపీతో సన్నిహితమయింది. తాము పోటీ చేస్తారో లేదో కానీ.. కేసీఆర్ ను ఓడించండానికి బీజేపీకి మద్దతివ్వడానికి రెడీ అయిపోతోంది. మునుగోడులోనూ బీజేపీకి సపోర్ట్ చేయనుంది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో సహకరించడం కామనే. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో పూర్తి స్థాయిలో .. సెంటిమెంట్ పేరుతో.. ఆంధ్రా పార్టీ పేరుతో… నాశనం చేయడమే కాకుండా… అందు కోసం ఫోన్ ట్యాపింగ్లు కూడా చేశారన్న ఆగ్రహం టీడీపీ అభిమానుల్లో ఉంది. ఇక కేసీఆర్ ఓడిపోతారు అనే నమ్మకం కలిగితే అందరూ ప్రత్యామ్నాయానికే మద్దతిస్తారు. ఇప్పటి వరకూ జరిగింది అదే.
ఇప్పుడు ఆ పరిస్థితి కనిపిస్తోంది. మునుగోడులో టీఆర్ఎస్ ఓడిపోతే అది ప్రభుత్వ వ్యతిరేకతకు నిలువెత్తు సాక్ష్యం అవుతుంది. ఉపఎన్నిక తెచ్చిన కోమటిరెడ్డి గెలిస్తే.. ఆయనపై ఉన్న వ్యతిరేకతను మించి టీఆర్ఎస్ కు వ్యతిరేకత ఉన్నట్లు. అంటే. .. బీజేపీని ఆప్షన్ గా ఎంచుకోవడానికి ప్రజలు సిద్ధమైనట్లే. ఇలా ప్రజలకు ప్రత్యామ్నాయంపై నమ్మకం కుదిరితే… మొత్తం కోల్పోవడమే. గతంలో టీఆర్ఎస్కు భయంతోనే.. భక్తితోనే అండగా నిలిచిన టీడీపీ వాళ్లు కూడా ఇప్పుడు… పోలోమంటూ బీజేపీ వైపు వెళ్లిపోతారు. దానికి చంద్రబాబు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు.
నిన్నామొన్నటి వరకూ తెలంగాణలో తెలుగుదేశం మద్దతు తీసుకోవాలంటే చాలా మంది ఆలోచించేవాళ్లు. ఎందుకంటే కేసీఆర్… చంద్రబాబు లేదా టీడీపీని బూచిగా చూపి సెంటిమెంట్ రెచ్చగొడతారనే ఆందోళన వారికి ఉండేది. కానీ ఇప్పుడు కేసీఆర్ తన టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారు. మళ్లీ తెలంగాణపై దండెత్తుతున్నారని కానీ.. తెలంగాణను మళ్లీ ఏపీలో కలుపుతారని కానీ.. లేకపోతే మరో రకమైన తెలంగాణ సెంటిమెంట్ ను కానీ రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేరు. అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మద్దతు కోసం బీజేపీ నేరుగా ప్రయత్నిస్తోంది. మునుగోడులో టీడీపీ మద్దతు ప్లస్ అయితే.. వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీకి తిరుగుండదనే వాదన బలపడుతుంది. చివరికి అది కేసీఆర్ పదవిని కోల్పోయేలా చేస్తే.. చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్లే అవుతుంది.