కొన్ని విషయాలు స్వానుభవం మీద మాత్రమే అర్ధం అవుతుంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అటువంటి అనుభవమే ఎదురవుతోంది. అమరావతి శంఖుస్థాపన కార్యక్రమం నుండి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తో స్నేహం చిగురించినందుకు దానిని నిలబెట్టుకొనేందుకు ఆయన చాలా భారీ మూల్యమే చెల్లిస్తున్నారు. వరంగల్ ఉప ఎన్నికలు ప్రచారానికి వెళ్ళలేదు. తెలంగాణాలో పార్టీని, రాజకీయ వ్యవహారాలకి దూరంగా ఉంటున్నారు. జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో కూడా జోక్యం చేసుకోకుండా ఉండబోతున్నట్లు సంకేతాలు ఇచ్చేరు.
ఇంత చేసినా తెరాస యధాప్రకారం తెదేపాకు చెందిన నేతలను, ఎమ్మెల్యేలను తన పార్టీలోకి ఆకర్షిస్తూనే ఉంది. రెండు రోజుల క్రితమే తెదేపా ఎమ్మెల్యే సాయన్నను తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తెరాసలో చేర్చుకొన్నారు. వచ్చే నెలలో జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు జరిగేలోగా ఇంకా చాలా మంది తెదేపా నేతలను తెరాసలోకి ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మురంగా సాగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ తను చేయబోయే చండీయాగానికి చంద్రబాబు నాయుడు ఆహ్వానిస్తానని తెలిపారు.
ఇంతకు ముందు తెలంగాణా వైకాపాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలని తెరాసలోకి ఫిరాయింపజేసిన తరువాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో వైకాపా తెరాసకు మద్దతు ఇచ్చినపుడు తెదేపా నేతలు విమర్శలు గుప్పించారు. పార్టీ ఎమ్మెల్యేలని తెరాస తీసుకుపోతున్న జగన్మోహన్ రెడ్డి ఏవిధంగా తెరాసకు మద్దతు ఇచ్చారని ప్రశ్నించారు. ఇప్పుడు సరిగ్గా అటువంటి పరిస్థితే చంద్రబాబు నాయుడుకి ఎదురయింది. తెదేపా ఎమ్మెల్యే సాయన్నని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా తెరాసలో చేర్చుకొన్నపటికీ ఆ విషయం పట్టించుకోకుండా చండీయాగానికి హాజరయితే అప్పుడు వైకాపా నేతలు కూడా ఇదే ప్రశ్న వేస్తారు.
తెలంగాణాలో తెదేపా నేతలను తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడమని చెపుతూ, మళ్ళీ చంద్రబాబు నాయుడు, తాము వ్యతిరేకిస్తున్న కేసీఆర్ తోనే రాసుకుపూసుకు తిరుగుతుంటే తమ పోరాటాలని ప్రజలు కూడా నమ్మబోరని తెలంగాణా తెదేపా నేతలు చెపుతున్నారు. తమ పార్టీ నుండి తెరాసలోకి ఫిరాయించిన నేతలు, ఎమ్మెల్యేలు అందరూ ఆ యాగంలో చంద్రబాబు నాయుడుకి ఎదురయితే అది ఆయనకీ, వారికీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వారందరూ నేటికీ తెదేపా ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నారు కానీ ఇప్పుడు తెరాస కండువాలు కప్పుకొని చంద్రబాబు నాయుడుకి ఎదురవుతారు.
ఇవన్నీ ఆలోచించి చండీయాగానికి వెళ్ళకుండా ఉంటే, తెలంగాణా ముఖ్యమంత్రి స్వయంగా పిలిచినా హాజరుకాకపోవడం తెలంగాణా ప్రజలను అవమానించడమేనని తెరాస ప్రచారం చేసుకోవచ్చును. చంద్రబాబు నాయుడు పిలవగానే తమ మధ్య ఎన్ని భేదాభిప్రాయాలున్నా కేసీఆర్ వాటిని పక్కనపెట్టి అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి హాజరయి వచ్చేరని కానీ చంద్రబాబు నాయుడు పిలిచినా హాజరు కాకుండా అవమానించారని ప్రచారం చేసుకోవచ్చును.
చంద్రబాబు నాయుడు ఈ యాగానికి వెళ్ళినా వెళ్ళకపోయినా తెరాస ఏమీ తెదేపాను భుజానికెత్తుకొని మోయదు. తెదేపా నేతలను ఆకర్షించడం మానుకోదు. అలాగే తెదేపాను ఎండగట్టకుండా వదిలిపెట్టదు కూడా. కనుక ఈ యాగానికి వెళ్లి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవడం కంటే, వెళ్ళకుండా ప్రతికూల ప్రచారాన్ని ఎదుర్కోవడమే తెదేపాకు తేలికగా ఉంటుంది. తెరాసతో స్నేహం అంటే కత్తి మీద సాము వంటిదేనని చంద్రబాబు నాయుడుకి ఈపాటికే అర్ధమయయి ఉండవచ్చును. మరి ఆయన ఆ సాముకే మొగ్గు చూపుతారో లేక తెలంగాణాలో పార్టీని రక్షించుకొనడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారో చూడాలి.