చెప్పే వాడికి వినేవాడు లోకువ అని సామెత! ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విషయంలో కూడా అంతే! ఎటూ ఆయన ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అత్యున్నత హోదాలో ఉన్నారు గనుక.. స్వపక్షంలోగానీ, ప్రజల్లో గానీ.. ఆయన చెప్పిన మాటలకు ఎదురాడి ప్రశ్నించగలవారు ఎవ్వరూ సాధారణంగా ఉండరు గనుక.. ఆయన సమాజానికి రకరకాల సలహాలు చెప్పేస్తుంటారు. ఏపీ ప్రజలందరూ ఎక్కువ మంది పిల్లల్ని కనాలనే సలహా దగ్గరినుంచి.. పొదుపు పాటించడం ఎలాగో… జనం తమ డబ్బులన్నీ పొదుపు చేసి.. రాష్ట్రానికి ప్రతిష్ఠాత్మకమైన అమరావతి రాజధాని నగరానికి విరాళంగా ఇవ్వడం ఎంత అవసరమో.. ఆయన చాలా వినసొంపుగా సలహాలు చెప్పేస్తుంటారు. జనానికి ఆ రీతిగా పొదుపు పాఠాలు బోధిస్తుండే ముఖ్యమంత్రి.. తన ప్రభుత్వ పనితీరు విషయంలో అదే తరహా పొదుపును పాటించగల తెగువతో ఉన్నారా? లేదా? సర్కారీ పొదుపునకు సంబంధించి… చంద్రబాబునాయుడుకు సొంతంగా ఒక ఆలోచన స్ఫురించకపోవచ్చు… కనీసం ఆంధ్రప్రదేశ్ తరహాలోనే బీదరికపు పరిస్థితుల్లో ఉన్న బీహార్ వంటి రాష్ట్రాలు చిక్కుకుంటున్న వివాదాలు, తీసుకుంటున్న కొత్త నిర్ణయాలనుంచి అయినా స్ఫూర్తి పొంది చంద్రబాబు పొదుపు పాఠాలు నేర్వవచ్చు కదా అనే వాదన ప్రజల్లో వినిపిస్తోంది.
ప్రతిఏటా ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు నిర్వహించినప్పుడు.. సమావేశాల ముగింపు లోగా కొన్ని ప్రభుత్వ శాఖల తరఫున సభలోని సభ్యులు అందరికీ చాలా విలువైన కానుకలు ఇవ్వడం ఆనవాయితీ. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, ఆ తరహా ఇతర ఖరీదైన సభ్యులు అందరికీ సమర్పించుకుంటూ ఉంటారు. పాలక, విపక్ష సభ్యులు ఏ అంశం మీద ఎంత శత్రువుల్లా కొట్లాడుకున్నప్పటికీ.. కానుకల దగ్గరకు వచ్చేసరికి ఆనందంగా వాటిని స్వీకరిస్తుంటారు.
అయితే ఈ కానుకల ఎపిసోడ్.. ఏపీ తరహాలోనే నిధుల లేమిలో ఉంటూ, కేంద్రం సాయం కోసం నిరీక్షించే జాబితాలో ఉన్న బీహార్ రాష్ట్రంలో వివాదాస్పదం అయింది. అక్కడ సభ్యులందరికీ మైక్రోఓవెన్లు కానుకలుగా ఇచ్చేసరికి.. ‘దుబారా’ అంటూ పెద్ద రాద్ధాంతం రేగుతున్నది. దానికి తోడు విపక్షంలోని భాజపా సభ్యులు తమకు ఆ కానుకలు వద్దంటూ ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయడానికి సిద్ధపడడంతో.. అసలు కానుకల సంస్కృతికే చరమగీతం పాడాలని నితీశ్‌కుమార్ ప్రభుత్వం ఇప్పుడు కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఆ మాటకొస్తే.. చంద్రబాబునాయుడు ప్రజలకు సుద్దులు చెప్పాల్సి వస్తే.. మరింత ఎక్కువగా.. పొదుపు పాఠాలు చెబుతుంటారు. కనీసం బీహార్ సర్కారుకు ఇప్పుడు ఎదురవుతున్న అనుభవాలను బట్టి అయినా.. ఆయన ప్రభుత్వానికి పొదుపు నేర్చుకుని… బడ్జెట్ సమావేశాల్లో కానుకల పేరిట కోట్ల రూపాయలు తగలేసే సంస్కృతికి చరమగీతం పాడితే బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారు. అలా చేస్తే.. చంద్రబాబు పొదుపును తాను ఆచరించి.. తర్వాత ఇతరులకు చెప్పే అదికారాన్ని సంపాదించుకున్నట్లు అవుతుంది.