ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు రాహుల్ గాంధీతో సమావేశం కాబోతున్నారు. గురువారం ఢిల్లీకి వెళ్తున్న ఆయన .. జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నారు. వారంలో రెండో సారి హస్తినకు వెళ్తున్న చంద్రబాబు… ఎజెండా… చాలా పెద్దగానే ఉంది. సేవ్ నేషన్ పేరుతో జాతీయ స్థాయి మహాకూటమిని సిద్దం చేసి.. జనవరి కల్లా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువారం రాహుల్ తో పాటు… శరద్ పవార్, ఫరూక్ అబ్ధుల్లా, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ తో సమావేశం అవుతారు. గత ఢిల్లీ పర్యటనలో బీఎస్పీ అధినేత్రి మాయావతి, సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డిని కలిశారు. రేపు సీతారాం ఏచూరిని కూడా కలవనున్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ వ్యవస్థల్నీ నిర్వీర్యం చేస్తున్నారన్న భావనలో ప్రజల్లో ప్రారంభమయింది. అందుకే సేవ్ నేషన్ పేరుతో ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకం చేయాలనుకుంటున్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ఏర్పాటు చేస్తే కలిసేందుకు తాము సిద్దంగా ఉన్నామని పలు ప్రాంతీయ పార్టీ నేతలు ముందుకు వచ్చారు. ప్రాంతీయ పార్టీలుగా రాష్ట్రాలలో , జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని కూటమి లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. రాజకీయ అవసరాల కోసం ప్రాంతీయ పార్టీలను అణగదొక్కుతున్న బిజెపిని ఐకమత్యంగా ఎదుర్కోవాలని నిర్ణయించారు. ఈ కూటమి రూపురేఖలు ఎలా ఉండాలనే అంశంతో పాటు .. భావసారూప్యత ఉన్న పార్టీ నేతలతో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలనే యోచనలో చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ముందుగా రాహుల్ గాంధీతో సమావేశం లేదు. కానీ చంద్రబాబు గురువారం ఢిల్లీ వస్తున్నారని తెలుసుకున్న రాహుల్ గాంధీ …తన కార్యాలయం నుంచి చంద్రబాబు ఢిల్లీ టూర్ షెడ్యూల్ ను అడిగి తెలుసుకున్నారు. ఇరువురి భేటీకి సమయం ఖరారు చేసుకున్నారు. గురువారం మధ్యాహ్నంలోపు రాహుల్ గాంధీ, చంద్రబాబు మధ్య భేటీ జరగనుంది. ఈ భేటీలో తెలంగాణాలో మహా కూటమి అంశాలు, జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు వంటి అంశాలపై ఇరువురు మధ్య చర్చ జరగనుంది.
2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏపికి ప్రత్యేక హోదా ఇస్తూ మొదటి ఫైల్ పై సంతకం చేస్తానని … విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని రాహుల్ గాంధీ పదే పదే చెబుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చేందుకు ముందుకు వచ్చే ఏ పార్టీతోనైనా కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామని తెలుగుదేశం ఇప్పటికే ప్రకటించింది. ఏపికి ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని బిజెపి చెప్పినందున.. ఇక ఆ పార్టీతో తాడో, పేడో తేల్చుకోవాలని తెలుగుదేశం నిర్ణయించింది. జాతీయ స్థాయి మహాకూటమి కోసం ఇప్పటి వరకూ ఎవరూ పూర్తి స్థాయిలో చొరవ తీసుకోలేదు. ఇప్పుడు చంద్రబాబు ముందడుగు వేస్తున్నారు.