పార్టీలో కోవర్టులున్నారని వారిని ఏరివేసి ప్రక్షాళన ప్రారంభిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పుకొచ్చారు. కుప్పం నుంచే ఆ పని చేస్తానన్నారు. కుప్పంపై రివ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నిజానికి తెలుగుదేశం పార్టీలో నిజాయితీగా పని చేసేవారు ఎవరో.. ఇతర పార్టీలు కుమ్మక్కయిన వారు ఎవరో ఆ పార్టీలో కింది స్థాయిలో పని చేసే వారికీ స్పష్టత ఉంది. రాష్ట్ర స్థాయిలో పలువురు నేతలు గోడ మీద పిల్లుల్లాగా ఉంటూ.. అటు అధికార పార్టీకి కోవర్టులుగా పని చేస్తూ ఉంటారనేది అందరికీ తెలుసు. సీనియర్లు అనే కారణంగానో.. మరో మొహమాటంతోనే వారిని దూరం పెట్టలేకపోతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్ని అధిగమించి.. అలాంటి కోవర్టులందర్నీ బయటకు పంపేస్తానని చంద్రబాబు చెబుతున్నారు. కానీ అది సాధ్యమా అని టీడీపీ నేతలే నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే చంద్రబాబు ఇప్పటి వరకూ కఠినంగా తీసుకున్న నిర్ణయాలేమీ లేవు. గతంలో సిన్సియర్‌గా పని చేశారు కదా అన్న సానుభూతితో ఇప్పుడు పార్టీకి నష్టం చేస్తున్న వారినీ ఊపేక్షిస్తున్నారన్న భావన ఎక్కువ మందిలో ఉంది. ప్రజల్లో పట్టుకోల్పోయిన వారినీ అందలమెక్కించి..ఇప్పటికీ అనేక చోట్ల శల్యసారధ్యం అందించడానికి చంద్రబాబే పరోక్ష కారణం అన్న అభిప్రాయాలూ ఉన్నాయి. స్థానిక ఎన్నికల్లో అనేక చోట్ల వైసీపీతో కుమ్మక్కయి.. ఓ పది..ఇరవై కొర్పొరేటర్ లేదా కౌన్సిలర్ సీట్ల కోసం మొత్తం బలహీన అభ్యర్థుల్ని రంగంలోకి దించిన విషయం అందరికీ తెలుసు.
నెల్లూరులో అలాంటి ప్రయోగం చేసి..చివరికి ఒక్క కార్పొరేటర్ సీటు కూడా లేకుండా పోగొట్టుకున్నారు. కుప్పంలో చాలా మంది టీడీపీ నేతలు వైసీపీతో కుమ్మక్కయ్యారు..భయంతోనో.. డబ్బు కోసమో ఆ పని చేశారు. ఎవరెవరు అలా చేశారో.. టీడీపీ దగ్గర రికార్డులు ఉన్నాయి. కానీ చంద్రబాబు చర్యలు తీసుకోలేరు. చంద్రబాబు మాటల్లో చెప్పిన ప్రక్షాళన నిజంగా ప్రారంభిస్తే.. పార్టీకి మంచి రోజులు వస్తాయని చాలా మంది నమ్ముతున్నారు.