ఆంధ్రాపై కేంద్రం నిర్లక్ష్యానికి నిరసనగా ఇప్పటికే ధర్మ పోరాట సభలను అధికార పార్టీ టీడీపీ తరచూ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి, ఈ సభలను ఈ ఏడాది చివరి వరకు నిర్వహించి, ఆ తరువాత, కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెట్టాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యూహం అనేది ఇంతవరకూ టీడీపీ వర్గాల్లో ప్రచారంగా ఉంది. అయితే, ప్రస్తుతం చర్చనీయంగా నడుస్తున్న ధర్మ పోరాట సభా వేదికను.. చివరి సభతో జాతీయ స్థాయి చర్చనీయాంశం చేయాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది.
డిసెంబర్ లో చివరి ధర్మపోరాట దీక్ష కార్యక్రమం రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయనున్నారు. ఈ సభకు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీల ప్రముఖులను ఆహ్వానించాలని భావిస్తున్నారు. ముఖ్యంగా భాజపా వ్యతిరేక పక్షాలన్నింటినీ అమరావతి వేదిక మీదికి తీసుకొచ్చే ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సభలో ఏపీకి కేంద్రం చేసిన అన్యాయాన్ని ప్రధానంగా చర్చించాలని అనుకుంటున్నారు. ఇంకోపక్క, భాజపాకి వ్యతిరేకంగా ఇతర రాష్ట్రాల్లో జరగబోతున్న కార్యక్రమాలకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. జనవరిలో కర్ణాటకలో జరిగే రైతు సభకు ఆయన వెళ్తున్నట్టు నిన్ననే ప్రకటించారు. అలాగే, ఉత్తరప్రదేశ్ లో నిర్వహించబోతున్న భారీ ర్యాలీకి కూడా చంద్రబాబు వెళ్తున్నారు.
అమరావతిలో భారీగా తలపెడుతున్న ధర్మపోరాట దీక్ష సభ ద్వారా ఏపీ అంశాన్ని లోక్ సభ ఎన్నికల అజెండాగా మార్చేందుకు ఉపయోగపడే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఒక రాష్ట్రంపై భాజపా కక్ష సాధింపు ఎలా ఉంటుందని దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి, ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రాకి మించిన గొప్ప ఉదాహరణ మరొకటి లేదు. కాబట్టి, ఈ అంశానికి జాతీయ స్థాయి అంశంగా మార్చడం ద్వారా… లోక్ సభ ఎన్నికల తరువాత కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం ఏదైనాసరే, ఆంధ్రాకు అనుకూలంగా వ్యవహరించే అవకాశం కచ్చితంగా ఉంటుంది. అంతేకాదు, ఇప్పటికిప్పుడు జాతీయ పార్టీల అజెండాలో ఆంధ్రాకు కచ్చితమైన హామీలు ఇచ్చి తీరాలనే ఒక రకమైన పరిస్థితి కూడా క్రియేట్ అవుతుంది. ఆ విధంగా డిసెంబర్ లో జరగబోతున్న చివరి ధర్మపోరాట దీక్ష సభ వల్ల ప్రయోజనం ఉండే అవకాశం ఉంటుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి.