తెలంగాణ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ మళ్లీ బలప్రదర్శనకు సిద్ధమయింది. పార్టీ లీడర్లు అంతా వెళ్లిపోయినా ఎంతో కొంత బలం ఉందని భావిస్తున్న ఖమ్మంలో బుధవారం చంద్రబాబు బహిరంగసభలో ప్రసంగించబోతున్నారు. చంద్రబాబు ఖమ్మం జిల్లాకు హైదరాబాద్ నుంచి ర్యాలీగా వెళ్లనున్నారు. జూబ్లిహిల్స్ నుంచి ఆయన యాత్ర నాలుగైదు జిల్లాల ద్వారా సాగనుంది. రాత్రికి గంటలకు పాతర్లపాడు వద్ద ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణతో టూర్ ముగుస్తుంది. చేస్తోంది ఖమ్మం పర్యటననే అయినా.. తెలంగాణలో టీడీపీకి ఉన్న ఆదరణను చంద్రబాబు టెస్ట్ చేస్తున్నారని .. అనుకోవచ్చు.
ఇటీవల కాలంలో ఆంధ్రాతోపాటు తెలంగాణపైనా చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక్కడ కూడా రాజకీయంగా మళ్లీ పుంజుకోవాలని ప్రయత్నిస్తున్నారు. వరుసగా తమకు సానుకూలంగా ఉన్న జిల్లాలో పర్యటించి బలోపేతం చేయాలని భావనలో ఉన్నారు. టీడీపీ నుంచి బలమైన నాయకులుగా ఉన్న వారు వేరే పార్టీలకు వలస వెళ్లినప్పటికీ క్షేత్రస్థాయిలో ఉన్న క్యాడర్ను బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఎక్కడా లేనంతగా టీడీపీ ఉనికి ఖమ్మంలోనే కనిపిస్తోంది.
తెలంగాణ ఏర్పడినప్పటి నుండి తెలంగాణ రాష్ట్ర సమితికి ఖమ్మంలో మంచి ఫలితాలు సాధించలేదు. రెండు సార్లు ఎన్నికలు జరిగితే ఒక్కొక్క స్థానాన్ని మాత్రమే గెల్చుకుంది. ఓ సారి కొత్తగూడెం.. మరోసారి ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గాన్ని మాత్రమే గెల్చుకున్నారు. అయితే చేరికలతో నేతలకు లోటు లేకుండా కేసీఆర్ చేసుకున్నారు. కానీ ఆ పార్టీ ఓవర్ లోడ్ అయిపోయింది. మొత్తం నాలుగు వర్గాలు ఖమ్మంలో ఉన్నాయి. దీంతో సీట్ల కోసం పోటీ ఎక్కువగా ఉంది. దీనికి తోడు కమ్యూనిస్టులతో పొత్తు కూడా ఉంటుంది. వారికి రెండు, మూడు సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది.
మరో వైపు అన్ని నియోజకవర్గాల్లో బలమైన క్యాడర్ ఉన్న కాంగ్రెస్ పార్టీకి బలమైన నేతలు లేరు. ఇక బీజేపీకి.. అటు లీడర్లు కానీ.. ఇటు క్యాడర్ కానీ లేదు. దీంతో ఖమ్మంలో టీడీపీకి మంచి అవకాశాలు ఉంటాయని చంద్రబాబు భావిస్తున్నారు. కానీ చంద్రబాబు తెలంగాణలో జోక్యం చేసుకుటే కేసీఆర్ మరోసారి సెంటిమెంట్ రెచ్చగొట్టే అవకాశం ఉందన్న ఆందోళన ఇతర పార్టీల్లో ఉంది. అయితే బీఆర్ఎస్ అనిపెట్టుకుని సెంటిమెంట్ రెచ్చగొడితే.. ఇక ఆ పార్టీ ఎందుకని ఇతరులు ప్రశ్నిస్తారు. మొత్తానికి తెలంగాణ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది.