రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రాకు ఇస్తామన్న నిధులూ ప్రయోజనాలు ఇంకా కేంద్రం నుంచి రావాల్సినవి చాలానే ఉన్నాయి. ప్రత్యేక హోదా ఇస్తామని ఊరించి ఊరించి ఉసురు తీశారు. సరే, దానికి బదులుగా అంతకుమించిన ప్రత్యేక ప్యాకేజీ ఏదో ఇచ్చామన్నారు. ఆ మించిన ప్రయోజనాలేంటనేవి కార్యరూపంలో ఇంకా కనిపించడం లేదు! ఇక, రైల్వే జోన్.. వచ్చేస్తోంది వచ్చేస్తోందని అన్నారే తప్ప, అది జీవిత కాలం ఆలస్యంలా కనిపిస్తోంది. రాష్ట్రానికి ఉన్న రెవెన్యూ లోటు భర్తీ చేసే బాధ్యత కూడా తమదే అని కేంద్రం చెప్పింది. ఇంకా చేయాల్సిన భర్తీ చాలానే ఉందని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. ఇలా చెబుతూనే మూడున్నరేళ్లు గడిపేశారు. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు అంటున్నారు. ఈలోగా రాష్ట్రానికి ఇవ్వాల్సినవన్నీ కేంద్రం ఇస్తుందా అనేది అనుమానంగానే మారుతోంది. ఈ నేపథ్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారు.
ఆ తరువాత, మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రాకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నట్టుగా గత ఏడాది కేంద్రం ప్రకటించినా, ఇప్పటివరకూ చాలా తక్కువ నిధులు వచ్చాయని చంద్రబాబు చెప్పారు. ప్యాకేజీ ప్రకటన ప్రకారం చాలా నిధులు రావాల్సి ఉన్నా, విడుదల విషయంలో కేంద్రం తాత్సారం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన ప్యాకేజీ ప్రకారం నిధులను త్వరితగతిన విడుదల చేయాలని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని కోరినట్టు చంద్రబాబు చెప్పారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో ఏపీకి నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను, ఆ తరువాత భాజపా సర్కారు ఇచ్చిన హామీలన్నింటినీ సక్రమంగా అమలు చేయాలని కోరినట్టు చెప్పారు. రైల్వే జోన్ కూడా మనకు రావాల్సి ఉందనీ, దానిపై కూడా మాట్లాడామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు అనుకున్న సమయంలో పూర్తయ్యేందుకు ఇవ్వాల్సిన నిధుల విడుదల విషయమై కూడా మాట్లాడామనీ, ఇప్పటివరకూ పెట్టిన ఖర్చుకు సంబంధించిన బిల్లులు కొద్దిరోజుల్లో క్లియర్ అవుతాయని సీఎం చెప్పారు. ఈ సందర్భంగా రావాల్సిన నిధులు, కేంద్రం ఇస్తామన్న నిధులకు సంబంధించిన కొన్ని గణాంకాలను సీఎం వివరించారు.
భాజపాతో చెలిమి చెడిపోకూడదు అనే సూత్రాన్ని పెట్టుకుని… దానికి అనుగుణంగానే కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేయకూడదు, సామరస్యంగానే సాధించుకోవాలని చంద్రబాబు ఎప్పటికప్పుడు వ్యవహరిస్తూ ఉంటారు. ఇప్పటికీ అదే మార్గంలో వెళ్తున్నారు. మంచిదే.. కేంద్రంతో వైరం అవసరం లేదు. కానీ, ఇప్పటికే పుణ్యకాలం మూడున్నరేళ్లు పూర్తయింది. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు అంటున్నారు. భాజపా కూడా ఎన్నికల మూడ్ లోకి వచ్చేసింది. ఇకపై, కేంద్ర ప్రభుత్వం చేసే ఏ కార్యక్రమం అయినా, విడుదల చేసే ఏ నిధులైనా తమకు ఏ రకంగా ఉపయోగపడతాయనే కోణం నుంచే ఆలోచిస్తారు కదా! ఏపీకి కేంద్రం నుంచి ఎన్ని ప్రయోజనాలు అందుతున్నా, ఆ క్రెడిట్ టీడీపీ ఖాతాలో పడుతోందన్న అభిప్రాయం ఉండనే ఉంది. ఇలాంటప్పుడు కూడా ఇంకా విజ్ఞప్తులే అంటే ఎలా..? రైల్వే జోన్ ఎప్పుడు తేలుస్తారు.. స్పష్టత లేదు. ప్యాకేజీ ప్రకారం నిధులన్నీ ఎప్పటికి విడుదల అవుతాయి.. త్వరలోనే అంటున్నారూ, అక్కడా స్పష్టత లేదు. పెట్రో కెమికల్ కారిడార్ ఇస్తామని చెప్పి.. దానికీ రాష్ట్ర పెట్టుబడులపై మెలిక పెడుతున్నారు, ఇక్కడా క్లారిటీ లేదు. ఏపీ విషయంలో కేంద్రం వైఖరి ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా.. గట్టిగా నిలదీసే ప్రయత్నం చంద్రబాబు ఎందుకు చెయ్యరు..?