ప్రజల ధన, మాన, ప్రాణాల రక్షణ కోసమే ప్రభుత్వాలు ఉన్నాయి అని చెప్పి పుస్తకాల్లో బ్రహ్మాండంగా రాసి ఉంటారు. చిన్నప్పటి నుంచీ ఆ చదువులను బట్టీ పట్టిస్తారు కాబట్టి…అదంతా నిజమే కామోసు అన్న నమ్మకం కూడా ప్రజలకు కలుగుతూ ఉంటుంది. కానీ వాస్తవంలో మాత్రం పూర్తి విరుద్ధంగా జరుగుతూ ఉంటుంది. ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేయడంలో మాత్రం బ్రహ్మాండమైన శ్రద్ధ చూపే ప్రభుత్వం…ఆ ప్రజలు కట్టిన పన్నుల సొమ్ముతో ముఖ్యమంత్రి నుంచీ కిందిస్థాయి జీతగాడి వరకూ జీతభత్యాలు పెంచుకుంటూ పోవడంలో ఇంకా ఎక్కువ శ్రద్ధ చూపే ప్రభుత్వం బాధ్యతల నిర్వహణలో మాత్రం పూర్తి నిర్లక్ష్యంగా ఉంటుంది. చంద్రబాబునాయుడు అధికారంలోకి రాకముందు జెసి దివాకర్‌రెడ్డికి సంబంధించిన ఒక బస్సులో ఉన్న ప్రయాణికులందరూ సజీవ దహనమయ్యారు. అప్పట్లో ఆ కేసు గురించి రాజకీయ నాయకులు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ప్రజల్లో పెల్లుబికిన ఆగ్రహావేశాలు చల్లారేవరకూ పోలీసులు కూడా హడావిడి చేశారు. ఆ తర్వాత ఆ కేసు గతి ఏమైందో తెలియదు? ఏ ఒక్కరికైనా శిక్ష పడేలా చేశారా అంటే సమాధానం లేదు.
ఇప్పుడు మరోసారి దివాకర్ ట్రావెల్స్‌కి చెందిన ఓ బస్సు ప్రమాదానికి గురయింది. పది మందికి పైనే చనిపోయారు. చనిపోయినవాళ్ళ వివరాలు తెలుసుకున్న జనాలకే కన్నీరు వచ్చే పరిస్థితి. కానీ చంద్రబాబు నుంచి మాత్రం దిగ్భ్రాంతికి గురయ్యాం అన్న ఓ రొటీన్ స్టేట్మెంట్ వచ్చేసింది. అంతకుమించి ఆయన తీసుకోబోయే చర్యలేంటి? అనే విషయం గురించి మాత్రం ఏమీ మాట్లాడలేదు. బాధితులకు ఇప్పించే పరిహారం గురించిన ప్రకటన కూడా లేదు. ప్రైవేట్ ట్రావెల్స్‌కి చెందిన బస్సులు ప్రమాదాలకు గురయినప్పుడు, ప్రాణాలు పోయినప్పుడు చర్యలు తీసుకునే విషయం పక్కన పెడితే……..రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ప్రజలను ఎంతలా దోచుకుంటున్నారో పాలకులకు తెలియదా? తక్కువ జీతాలకు వస్తున్నారని చెప్పి లారీ డ్రైవర్స్, క్లీనర్ స్థాయి వ్యక్తులను డ్రైవర్స్‌గా నియమించుకుంటున్న విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్ళడం లేదా? ప్రయాణికులతో రౌడీల్లా ప్రవర్తించని ప్రైవేట్ ట్రావెల్స్ ఎంప్లాయిస్ ఎంతమంది ఉన్నారు?
ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు చేస్తున్న తప్పులన్నీ ప్రభుత్వాలకు తెలుసు. కానీ చర్యలు మాత్రం ఉండవు. ఎందుకంటే ఆ ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులందరూ కూడా అదే ప్రభుత్వంలో పెద్ద పెద్ద పదవుల్లోనూ, చట్టసభ సభ్యులుగానూ ఉన్నారు కాబట్టి. ఇంతకుముందు వరకూ కనీసం ప్రాణాలు పోయిన సందర్భాల్లోనయినా కాస్త తీవ్రంగా స్పందించినట్టుగా కనిపించేవాళ్ళు. ఈ సారి అలాంటి ప్రయత్నం కూడా కనిపించలేదు. సో….ఇక నుంచి ప్రజల ప్రాణాలు పోయినా సరే…..ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏమీ ఉండవు అని చాలా స్పష్టంగా ఆ ప్రజలకు చెప్పేశారన్నమాట. ఇలాంటి పాలకుల విషయంలో ప్రజల స్పందన ఎలా ఉంటుందో ముందు ముందు చూడాలి మరి.