ఈ మధ్య విజయవాడ పుస్తక ప్రదర్శనలో ప్రసంగించిన తర్వాత నాతో మాట్లాడిన వారిలో ఇద్దరు విద్యాధికులు ఒక అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రసంగం ప్రధాన భాగాన్ని అభినందిస్తూనే అమరావతిని భ్రమరావతి అని వర్ణించడం ఎందుకని వారు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదో ఒకటి చేస్తే మంచిదే కదా…అని అడిగారు. మొన్నటి మంత్రి వర్గ సమావేశం తర్వాత ఒక సీనియర్ మంత్రితో మాట్లాడితే ముఖ్యమంత్రి సింగపూర్‌పై చాలా ఆశలు పెట్టుకున్నప్పటికీ వారి నుంచి అంత సహకారం రాలేదని చెప్పారు. ఈ కారణంగా హడ్కో రుణ సహాయంతో తామే నిర్మాణం చేపట్టవచ్చని సూచించారు. సింగపూర్‌పై ఆయన పెట్టుకున్న ఆశలే అడియాసలైనప్పుడు ఆయన దానిపై చేసిన వాగ్దానాలు నెరవేర్చే అవకాశమెక్కడ? మా సభ జరిగిన రోజునే గుంటూరులో అమరావతి మాష్టర్ ప్లాన్‌పై సదస్సు భూములిచ్చిన రైతులు స్థానికుల నిరసనలతో రసాభాసగా మారింది. ప్రభుత్వం విడుదల చేసిన మాష్టర్ ప్లాన్‌లో భూములిచ్చిన వారికి వాణిజ్య ప్లాట్లు ఎక్కడ ఇస్తారనేది చూపించలేదు. ప్రధాన వాణిజ్య ప్రాంతంలో గాక ద్వితీయ స్థాయి కేంద్రాలలో ఇస్తారన్నది కొన్ని పత్రికల్లో సూచించిన అంశం. రాజధానిని అభివృద్ధి ఫలాలు భూములిచ్చిన వారికే చెందేట్టు చేస్తానని చంద్రబాబు చెప్పింది మ్యాపులో కనిపించకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. వారికి అధికారులు ఏదో చెప్పి బుజ్జగించారు.
ముఖ్యమంత్రి ఈ మధ్యనే విజయవాడ,తిరుపతి,విశాఖపట్టణం నగరాలను మూడు రకాలుగా అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. నరసరావుపేటను, తెనాలిని ఎక్కడకు వెళితే అక్కడ సింగపూర్‌గా చేస్తానని ఆయన చెబుతుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కూడా హైదరాబాదు పాతబస్తీని ఇస్తాన్‌బుల్(టర్కీ రాజధాని)గా మారుస్తానని ఒకసారి ప్రకటించారు. హైదరాబాదును విశ్వనగరంగా చేశానని చంద్రబాబు ఎప్పుడూ చెబుతుంటారు. నిజాం కాలంలోనే అది విశ్వనగరం అని టిఆర్ఎస్ వాదిస్తుండేది. కాని ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికల సందడి మొదలైనాక కెటిఆర్ నోట విశ్వనగరం మోత మరోసారి మొదలైంది. వరంగల్లోనూ కరీంనగర్లోనూ కెసిఆర్ అలాటి వరాలే కురిపించారు. వెళ్లిన చోట నాలుగు మంచి మాటలు చెప్పడం సహజమే గాని ఉన్న ఫళాన పట్టణాలు నగరాలను ఎక్కడికో తీసుకువెళ్లడం అంటే అది జరిగేపని కాదు.
ఏ పట్టణం అభివృద్ది అయినా అనేక భౌగోళిక చారిత్రిక ఆర్థికాంశాలపై ఆధారపడి వుంటుంది. పంటల తీరు, వాతావరణ పరిస్థితులు, ఉత్పత్తి కేంద్రాలు, రాజకీయ పాలనా సుస్థిరత, మత సంబంధాలు వంటి అనేక అంశాలు దాన్ని ప్రభావితం చేస్తాయి. తెలుగు రాష్ట్రాలలోనే చూస్తే రాజవంశాలు, రాజధానులు విద్యా విజ్ఞాన కేంద్రాలు అనేక మార్పులకు గురవడం గమనించవచ్చు. ఇదంతా కేవలం పాలకుల ఇష్టాయిష్టాలను బట్టి జరిగింది కాదు. బ్రిటిష్‌వారు మొదట బందరులో కేంద్రం పెట్టుకోవాలనుకున్నారు. అందుకు అనుమతి లభించకపోవడంతో చెన్నపట్టణం తరలి వెళ్లి, మద్రాసు రేవు పట్టణం నిర్మించుకున్నారు. వారి హయాంలో కోల్‌కతా,ముంబాయి ఢిల్లీ కేంద్రాలుగా వివిధ కోణాలలో అభివృద్ధి చెందాయి. మొదటి దశలో వారి వాణిజ్య పంటలైన నీలిమందు,జనుము వంటివాటికి కేంద్రంగా వున్న కొల్కతా తర్వాత ఆ రంగాలకు కాలం చెల్లిన ఫలితంగా పరిశ్రమలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. ముంబాయిలో వస్త్ర పరిశ్రమ దెబ్బతినడం అనేక దుష్పరిణామాలకు దారితీసింది.
ప్రభుత్వ రంగ పరిశ్రమల స్థాపన కారణంగా హైదరాబాదు. విశాఖ పట్టణం పారిశ్రామిక కేంద్రాలైనాయి. గత రెండు దశాబ్దాలలోనూ సరళీకరణలో ప్రైవేటీకరణ కారణంగా ఆ పరిశ్రమల మూత హైదరాబాదును దెబ్బతీసింది. విశాఖ నగరం రేవు పట్టణం కావడం వల్లనూ అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ వంటి భారీ సంస్థల కారణంగానూ హైదరాబాదులా మారకపోయినప్పటికీ ఇంతకుముందున్న వూపు తగ్గిన మాట నిజం. ఇతర అనేక పట్టణాలు నగరాల్లో ప్రైవేటు ఫ్యాక్టరీల మూత వల్ల వేలమంది కార్మికులు వీధులపాలైనారు. జీవితాలు తలకిందులైనాయి. వ్యవసాయరంగం కూడా చితికిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించింది. గ్రామాల నుంచి పట్టణాలకు వలసరావడం సర్వసాధారణం కాగా అక్కడ కూడా భద్రతలేని కొలువులే. దెబ్బతిన్న ఉపాధి పరిస్తితులకి ఆహార అభద్రత తోడైంది. సామాజిక అశాంతి పెరిగింది.
వీటిని పరిష్కరించకుండా ఆఘమేఘాల మీద అభివృద్ధి చేస్తామని చెప్పడం అర్థరహితం.క్షణాల మీద తరలించగల ఔట్సోర్సింగ్ తరహా ఐటి ఉపాధిని అతిగా చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు. కొన్నేళ్ల కిందట అమెరికాలో ఆర్థిక సంక్షోభం రాగానే ఒక్కసారిగా తలకిందులైంది. ఐటి అభివృద్ధికి పరిమితులు ఏర్పడ్డాయనేది నిపుణులు చెబుతున్న మాట. అది సేవారంగమే తప్ప ఉత్పత్తి ఉపాధి ప్రధానమైన రంగం కాదు. ఫార్మా రంగంలోనూ ఉపాధి తక్కువగానే వుంటుంది. వ్యవసాయ ఉత్పత్తి రంగాలు అభివృద్ధి చెందితేనే నిజంగా అభివృద్ది సాధ్యం. ఇప్పుడున్న పరిస్థితిలో ఉత్పత్తి రంగం వాటా ఆంధ్రప్రదేశ్‌లో 25 శాతం కన్నా తక్కువగా వుంది. చంద్రబాబు గతంలో ఆయన తీసుకున్న భూములు గాని తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పెద్ద ఎత్తున తీసుకున్న భూములలో గాని ఏ పరిశ్రమలు వచ్చి ఎంత ఉపాధి పెరిగింది? నిరాశ్రయులైనవారెందరు?
దేశ విదేశ పారిశ్రామికవేత్తలు వచ్చి విజయవాడలో హైదరాబాదులో పాలకులతో చర్చలు జరిపినంత మాత్రాన పెట్టుబడులు కురిపిస్తారనుకోవడం సరికాదు. వారికి లాభం వుండకపోతే ఎవరూ రారు. ఇప్పుడు ఏ దేశమూ మరో చోట భారీ ఉత్పత్తి సంస్థల స్థాపనకు సహాయపడే పరిస్థితి లేదు. ఉత్పత్తి ప్రక్రియలో వచ్చిన సాంకేతిక మార్పులు కూడా అలాగే వున్నాయి. ప్రధాని మోడీ మేకిన్ ఇండియాకు ఇంతవరకూ ఏమాత్రం స్పందన వచ్చింది? పెట్టుబడులను ఆకర్షించడం తప్పు కాదు గాని ఆ ప్రక్రియ పారదర్శకంగా వుండాలి. బినామీ దళారులకు భూములు కట్టబెట్టినంత మాత్రాన పరిశ్రములు రావని గత ఇరవై ఏళ్ల పరిణామాలు చెబుతున్నాయి. ప్రకృతి వనరులను కొల్లగొట్టడానికి, భూములను సేకరించడానికి మాత్రమే ఇవి అక్కరకు వచ్చాయి. కృత్రిమంగా భూముల విలువ పెంచడమే అభివృద్ధి కాదు. ఉపాధి ఆహారం విద్య వైద్యం ప్రజలకు అందించేదే సరైన అభివృద్ధి నమూనా అవుతుంది.