నిర్మాతల బంద్ వెనుక కొన్ని ఆసక్తికరమైన విషయాలు మెల్లమెల్లగా వెలుగులోకి వస్తున్నాయి. హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టుల పారితోషికాలు, వాళ్ల సిబ్బంది జీత భత్యాలూ, ఎగస్ట్రా ఖర్చులు ఇవన్నీ భరించలేని నిర్మాతలు.. వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ అదుపులోకి తీసుకురావాలన్న నిర్ణయానికి వచ్చారు. ముఖ్యంగా ఇద్దరు క్యారెక్టర్ ఆర్టిస్టులపైనే నిర్మాతలు గురి పెట్టారు. ప్రతీ మీటింగులోనూ ఆ రెండు పేర్లే నిర్మాతలు ఉచ్ఛరిస్తున్నట్టు ఇన్ సైడ్ వర్గాల టాక్. ఆ ఇద్దరూ.. రావు రమేష్, మురళీ శర్మ.
టాలీవుడ్ లో మాంఛి డిమాండ్ ఉన్న ఆర్టిస్టులు వీరిద్దరూ. తండ్రి, బాబాయ్, మావయ్య, పాజిటీవ్, నెగిటీవ్ ఇలా ఏ పాత్రలో అయినా ఇమిడిపోతారు. అందుకే దర్శక నిర్మాతలు వీళ్లపై మొగ్గు చూపిస్తుంటారు. దాన్ని ఆసరా చేసుకుని వీరిద్దరూ గొంతెమ్మ కోరికలు కోరుతున్నారన్నది నిర్మాతల గోల. రావు రమేష్ పారితోషికం రోజుకి రూ.5 లక్షలు. అక్కడితో ఆగదు. క్యార్ వేర్ సెపరేట్ గా కావాలి. ఇద్దరు క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఓ కార్ వాన్ ఇస్తుంటారు. కానీ రావు రమేష్‌కి అది నచ్చదట. తనకు సెపరేట్ గా ఒక కార్ వాన్ కావాలని డిమాండ్ చేస్తాడట. అంతే కాదు.. తనకు ముగ్గురు అసిస్టెంట్లు. వాళ్ల జీత భత్యాలూ నిర్మాతలే భరించాలి. మురళీ శర్మదీ అదే తంతు. వీరిద్దరి డిమాండ్లు నిర్మాతలు తట్టుకోలేకపోతున్నారని టాక్. నిన్న ప్రొడ్యూసర్ గిల్డ్ తో `మా` మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో వీరిద్దరి పేర్లే గట్టిగా వినిపించాయని టాక్.
మరో వైపు ఇద్దరు హీరోలపై కూడా నిర్మాతలు దృష్టి పెట్టారు. ఆ ఇద్దరికీ పారితోషికమే పరమావధి. సినిమా హిట్టు, ఫ్లాపుతో సంబంధం లేదు. సినిమా సినిమాకీ పారితోషికం పెంచుకుంటూ వెళ్తుంటారు. తమ సినిమా ఫ్లాప్ అయినా నిర్మాతలకు పారితోషికాల్లో రిబేటు ఇవ్వరు. అలాంటప్పుడు ఆ హీరోల చుట్టూ ఎందుకు తిరగాలి? ఆ హీరోలతో సినిమాలు ఎందుకు చేయాలి? అని కొంతమంది నిర్మాతలు `మా` మీటింగ్ లో గట్టిగా వాదించినట్టు సమాచారం. ఆ ఇద్దరు హీరోల్ని నిర్మాతలంతా పక్కన పెట్టాలని, అప్పుడు గానీ దారిలోకి రారని కొంతమంది నిర్మాతలు అంటున్నారు. ఆ ఇద్దరు హీరోలెవరన్నది ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చకు తావిస్తోంది.