కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి తమ కార్యాచరణ ప్రకటించారు. ముఖ్యమంత్రికి సంబంధించిన సామాజిక వర్గం ఎలాగైతే ఒకటిగా ఉంటూ, ఎన్నికల సమాయానికి వారికే ఓట్లేస్తారో.. అదే స్ఫూర్తితో తమ జాతి కూడా రాజకీయం చేయబోతుందన్నారు! మోసం చేసిన ముఖ్యమంత్రిని ఎలా మోసం చేయాలనే ఉద్దేశంతో తమ కార్యక్రమం ఉండబోతోందని ముద్రగడ చెప్పారు. మోసం మీద మోసం, దగా మీద దగా చేసి నాలుగేళ్లపాటు చంద్రబాబు నాయుడు కాలక్షేపం చేశారని ఆరోపించారు. భాజపాతో సంబంధాలు బాగున్నంతకాలం కాపు జాతికి ఇచ్చిన హామీ అమలు చేయలన్న ఆలోచనే రాలేదన్నారు. తగదా వచ్చిన తరువాత రిజర్వేషన్ల బిల్లు ఆమోదించి, భాజపా మోసం చేసిందని ఇప్పుడు చెప్తున్నారన్నారు.
తమ జాతిని దగా చేస్తున్నారనీ, మోసం చేస్తున్నారని ముద్రగడ విమర్శించారు. ఇచ్చిన హామీ అమలు చేయకుండా తమ జాతిపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. 2019లో తమ జాతి ఆగ్రహాన్ని ముఖ్యమంత్రి చవి చూస్తారని హెచ్చరించారు. మోసం చేసిన పార్టీని నట్టేట ముంచడమే తమ ముందున్న కార్యాచరణ అన్నారు. టీడీపీని ఓడించాలని చెప్తున్నంత మాత్రాన, కళ్లు మూసుకుని వేరే పార్టీకి మద్దతు ఇచ్చే పరిస్థితి ఉండదన్నారు. తమ జాతికి నమ్మకమైన హామీ ఇచ్చిన పార్టీకి మాత్రమే మద్దతు ఇస్తామన్నారు. ఏపార్టీకి మద్దతు ఇవ్వాలనే అంశంపై లోతుగా చర్చిస్తామనీ, 13 జిల్లాల కాపు నాయకులతో ఏకాభిప్రాయానికి వచ్చాక ఆ నిర్ణయం వెల్లడిస్తామని ముద్రగడ అన్నారు. తమకు ఇస్తున్న హామీలను నమ్మొచ్చా లేదా అనేదానిపై తీవ్రంగా చర్చిస్తామన్నారు. సొంతంగా రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన లేదనీ, పార్టీ పెట్టడం అంత సులువైన పని కాదని వ్యాఖ్యానించారు.
నిజానికి, కాపు రిజర్వేషన్ల కోసం ఏపీ సర్కారు చేయాల్సిన పని చేసింది. కమిషన్ వేసింది, నివేదిక తెప్పించింది. తదనుగుణంగా అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది. అది కేంద్రం వద్ద పరిశీలనలో ఉంది. అయితే, భాజపాతో సంబంధం తెంచుకున్నాకనే కాపు రిజర్వేషన్ల బిల్లును చంద్రబాబు ఆమోదించారని ముద్రగడ ఆరోపించడం సరైంది కాదు. భాజపాతో సంబంధాలు బాగున్నప్పుడే మంజునాథన్ కమిషన్ ఏర్పాటు చేశారు కదా! ఇచ్చిన హామీపై రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో జరగాల్సిందంతా జరిగింది. ఎన్డీయేతో టీడీపీ విడిపోవడానికీ, కాపుల హామీపై ప్రభుత్వ వైఖరికీ ముడి పెడితే ఎలా..? వచ్చే ఎన్నికల్లో నమ్మకమైన హామీ ఇచ్చే పార్టీకే మద్దతు అని ఇప్పుడు ముద్రగడ అంటున్నారు. రిజర్వేషన్ల విషయమై ఇంకా కొత్తగా ఇతర పార్టీలు ఏమి హామీ ఇవ్వగలవు..?