కేసీఆర్ ఒక సారి ఎవరిపైనైనా అభిమానం చూపిస్తే వారికి లభించే ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఆయన అభిమానాన్ని కోల్పోతే మాత్రం అధ:పాతాళానికి తొక్కేసే వరకూ ఊరుకోరు. ఇప్పుడు చినజీయర్ స్వామికి ఇలాంటి పరిస్థితే కళ్ల ముందు కనిపిస్తోంది. అన్ని విధాలుగా సాయం చేసినా శిలాఫలకంపై కూడా పేరు లేకుండా చేసిన చినజీయర్‌పై అప్పటి వరకూ పెంచుకున్న అభిమానాన్ని కేసీఆర్ వదిలేశారు. ఆ వైపు కూడా చూడలేదు చివరికి రోజు కార్యక్రమాలకు ఆయనను తీసుకొచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. కానీ కేసీఆర్ హాజరు కాలేదు. దీంతో శాంతి కల్యాణం వాయిదా వేశారు.
అత్యంత వైభవంగా శాంతి కల్యాణం నిర్వహిస్తామని అక్కడ కేసీఆర్‌ను మోడీ కంటే ఎక్కువగా గౌరవించాలని చినజీయర్ ప్లాన్ చేస్తున్నారు. అయితే కేసీఆర్ వస్తారా రారా అన్నదానిపై స్పష్టత లేదు. పందొమ్మిదో తేదీన ఈ శాంతి కల్యాణం నిర్వహింపచేస్తామని చినజీయర్అంటున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఇక చినజీయర్ ముగిసిన అధ్యాయమని భావిస్తూ.. యాదాద్రి పున:ప్రారంభ యాగాలను నిర్వహించే మరో ప్రముఖ స్వామిజీని ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్నారని తెలుస్తోంది.
నిజానికి యాదాద్రి మొత్తం చినజీయర్ స్వామి కనుసన్నల్లోనే తీర్చిదిద్దుతున్నారు. కానీ చివరికి వచ్చే సరికి ఆయనకు ప్రాధాన్యం లేకుండా పోతోంది. ఏర్పాట్లు ఎలా చేయాలన్నదానిపై చాలా సార్లు చినజీయర్‌తో కేసీఆర్ చర్చించారు. కానీ ఇప్పుడు మాత్రం కేసీఆర్ ప్రత్యామ్నాయాన్ని చూసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఎలాగోలా అభిమానాన్ని నిలుపుకోవడమే ఇప్పుడు చినజీయర్ ముందున్న కర్తవ్యమని లేకపోతే.. ముచ్చింతల్ ఆశ్రమానికి ఎన్నెన్ని కష్టాలు వస్తాయో చెప్పలేమని ఊహాగానాలు అప్పుడే ప్రారంభమయ్యాయి.