అగ్ర హీరోలంటే చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ గుర్తొస్తారు. ఓ తరాన్ని వీళ్లు అలరించారు. ఇప్పటికీ వినోదాన్ని పంచుతూనే ఉన్నారు. అయితే వీళ్లలో ఎవరూ కలిసి నటించలేదు. మల్టీస్టారర్లు చేయలేదు. ఇప్పటి యువ హీరోలతో కలిసి నటించడానికి రెడీ అవుతున్నారే తప్ప, ఒకేతరం హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడానికి ఇష్టపడడం లేదు. అయితే.. ఈ లోటు తీర్చడానికి చిరంజీవి, వెంకటేష్ రెడీ అయ్యారు. ‘మేం కలిసి నటించడానికి సిద్ధమే’ అనే సంకేతాన్ని పంపారు.
వెంకటేష్ ‘సైంధవ్’ విడుదలకు రెడీ అయ్యింది. ఇది వెంకీ 75వ సినిమా. ఈ సందర్భంగా ఓ గ్రాండ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో ‘వెంకీతో సినిమా చేయాలని ఉంది. మేం కలిసి నటిస్తాం’ అని చెప్పారు చిరు. వెంకీ కూడా ‘మేం చేయబోయే సినిమా మామూలుగా ఉండదు’ అని అభిమానులకు పూనకాలు వచ్చే వార్త చెప్పారు. దాంతో ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు. ఎవరి వేడుకకు వెళ్లినా.. చిరంజీవి ఇలాంటి స్టేట్ మెంట్లు గుప్పించడం చాలా సహజం. ‘ఈ దర్శకుడితో చేయాలని ఉంది, ఈ హీరోయిన్‌తో జోడీ కట్టాలని ఉంది’ అని సరదా సరదా స్టేట్మెంట్లు ఇస్తుంటారు. అయితే అవెప్పుడూ వర్కవుట్ అయిన సందర్భాలు లేవు. ఈసారీ చిరు అలానే మాట్లాడారా? లేదంటే ఈ కామెంట్లలో సీరియస్‌నెస్ ఉందా? అనేది చూడాలి. వెంకీ, చిరు ఇద్దరూ కలిసి నటిస్తే కనుల పండగే. కానీ… ముందు కథ రెడీ అవ్వాలి కదా? ఈ హీరోలతో సినిమా చేయాలని దర్శకులకు అనిపించాలి కదా? ఇవన్నీ జరిగే పనులేనా..?