అన్నయ్య అటు… తమ్ముడు ఇటు… ఇది పైకి కనిపిస్తున్న చిత్రం! రాజకీయాల నుంచి సినిమాల్లోకి చిరంజీవి వచ్చేశారు. సినిమాల్లో ఉన్న పవన్ రాజకీయాలవైపు వెళ్తున్నారు. అంటే, చిరంజీవి ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటారు అనుకోవచ్చా..? సినిమాల్లో నటిస్తూ తనపని తాను చేసుకుంటూ పోతుంటారు అనుకోవచ్చా..? రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల్లో చిరంజీవి పాత్ర ఉండదనుకోవచ్చా..? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకటే సమాధానం… ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మెగాస్టార్ ప్రభావం ఉంటుందనే చెప్పాలి! ఆ దిశగానే తెర వెనక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని సమాచారం.
నిజానికి, చిరంజీవి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇంత లైమ్‌లైట్‌లో లేరు. 150వ చిత్రం విడుదల తరువాత ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నారు. వరుసగా సెలెబ్రిటీలను కలుస్తున్నారు. రాజకీయ వ్యాపారంగ ప్రముఖులతో పార్టీలకు వెళ్తున్నారు! ఈ క్రమంలోనే కళాబంధు సుబ్బరామిరెడ్డి ఇచ్చిన విందు అందుకున్నారు. ఈయనతోపాటు పలువురు ప్రముఖులు కూడా వరుసగా చిరంజీవిని పార్టీలకు ఆహ్వానిస్తున్నారు. ఇదే వరుసలో దర్శకరత్న దాసరి నారాయణరావు కూడా మెగాస్టార్‌ను ఇన్వైట్ చేస్తున్నట్టు వినిపిస్తోంది!
ఇవన్నీ కేవలం సరదాల కోసమో.. సాయంకాలం కాలక్షేపాల కోసమో జరుగుతున్న పార్టీలుగా చూడొద్దు! జాగ్రత్తగా గమనిస్తే వీటన్నింటి వెనకా ఒక రాజకీయ వ్యూహం నడుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు! దాసరి లాంటి వాళ్లు కాపు సామాజిక వర్గంలో కీలకంగా ఉంటున్న సంగతి ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. పైగా, రకరకాల రాజకీయ వ్యూహాలతో ఆయన ఉన్నారని బయట చెప్పుకుంటూ ఉంటారు.
నిజానికి, కాపు సామాజిక వర్గం పవన్ కల్యాణ్ వైపు కాస్త ఆశగానే చూస్తోందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ ముద్ర పవన్ కల్యాణ్‌కు ఇష్టం ఉందా లేదా అనేది ఆయన వ్యక్తిగత అభిప్రాయం! కానీ, పవన్‌ను చంద్రబాబు నాయుడు చేరదీస్తున్న కారణం కూడా ఇదే అయి ఉండొచ్చు. పవన్ కల్యాణ్‌లో ఒక బలమైన సామాజిక వర్గాన్ని తెలుగుదేశం చూస్తోంది! గత ఎన్నికల్లో అదే చంద్రబాబుకు ప్లస్ అయింది. భవిష్యత్తులో కూడా అదే బలంగా మార్చుకోవాలన్నది టీడీపీ వ్యూహం.
ఆంధ్రాలో ఏ ఇతర రాజకీయ పార్టీ అయినా వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుకోవాలంటే కాపుల్ని తమవైపు తిప్పుకోవాల్సి ఉంటుంది. అది జరగాలంటే.. పవన్, చంద్రబాబు బంధం బలహీనం కావాలి! ఇది జరగాలంటే చిరంజీవి మరోసారి హైలైట్ కావాలి!!! ఈ వ్యూహంలో ప్రత్యక్షంగా చిరంజీవి ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు. కానీ, పరోక్షం ఆయనకున్న మెగాస్టార్ కరిజ్మా చాలు కదా! సో.. ఈ వ్యూహం అమలులో భాగంగానే మెగాస్టార్‌కు కొన్ని సర్కిల్స్‌లో ప్రాధాన్యత పెంచుతున్నారన్నది విశ్లేషకుల అభిప్రాయం.