కేంద్ర ప్రభుత్వం ప్రతీ యేటా ఇచ్చే పద్మ పురస్కాల ప్రకటన ఈరోజు వెలువడనుంది. రిపబ్లిక్ డేని పురస్కరించుకొని ప్రతీ యేడాది జనవరి 25న పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్, భారతరత్న అవార్డులను ప్రకటించడం కేంద్రం ఆనవాయితీ. ఈసారి.. చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారం అందుతుందన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నందున సహజంగానే ఇటువైపు ఆసక్తి మళ్లింది. ఇది వరకు చిరుకి పద్మభూషణ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దేశంలోని రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ని చిరుకి ప్రకటిస్తే అంతకంటే మెగా న్యూస్ ఏముంటుంది?
నిజానికి.. ఎవరికి ఏయే అవార్డులు వస్తున్నాయన్న విషయాన్ని చాలా గోప్యంగా ఉంచుతారు. ముందస్తుగా ఎలాంటి లీకులూ ఉండవు. అవార్డు గ్రహీతలకు కూడా కేవలం ఒక గంట ముందే సమాచారం ఇస్తారు. అలాంటిది చిరంజీవికి పద్మ విభూషణ్ అనే న్యూస్ ముందుగా ఎలా లీకైందో అర్థం కావడం లేదు. బహుశా.. తెలంగాణ ప్రభుత్వం పద్మవిభూషణ్ని చిరు పేరుని సిఫార్సు చేసి ఉండొచ్చు. ఫైనల్ లిస్టులో చిరు పేరు ఉందా, లేదా? అనేది చూడాల్సివుంది. ఏదేమైనా చిరుకి పద్మ విభూషణ్ వస్తే.. తెలుగు వాళ్లు, ముఖ్యంగా చిరంజీవి అభిమానులు, చిత్రసీమ గర్వించదగిన విషయమే! నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ లాంటి సీనియర్లు కూడా పద్మకు వందశాతం అర్హులు. తెలుగు చిత్రసీమకు ఎంతో సేవ చేసిన చాలామంది ఇంకా పద్మ పురస్కారాలకు దూరంగానే ఉన్నారు. వాళ్లకు ఈసారైనా పద్మ వరిస్తుందేమో చూడాలి.