తెలంగాణ అసెంబ్లీకి సీఎం కేసీఆర్ మళ్లీ ముందస్తు ఎన్నికలకు వెళ్తారన్న చర్చ కొద్ది రోజులుగా రాజకీయవర్గాల్లో విస్తృతంగా జరగుతోంది. దీనికి కారణం ఉంది. ఎప్పుడూ లేని విధంగా కేసీఆర్ జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. భారీగా హామీలు ఇస్తున్నారు. పథకాలు ప్రకటిస్తున్నారు. దళితులకుటుంబాలకు రూ. పది లక్షలు ప్రకటించారు. ఇలాంటి చర్యల నడుమ ఆయన రాజకీయంగా కూడా తనకు.. కేటీఆర్‌కు ఎదురు లేకుండా చేసుకునే కార్యాచరణ కూడా అమలు చేస్తున్నారు. అందులోభాగంగానే ఈటల ఇష్యూ తెరపైకి వచ్చింది. అదే సమయంలో ఓ లీక్‌కు కూడా ప్రగతి భవన్ నుంచి .. మీడియాకు అందింది. కేసీఆర్‌కు అలాంటి ఆలోచన ఉందని.. సమాచారాన్ని బయటకు పంపారు.
ఇప్పుడు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా అదే చెబుతున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు పదిహేనో తేదీ తర్వాత కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేయబోతున్నారని జోస్యం చెబుతున్నారు. రాసిపెట్టుకోండని ఆయన గట్టిగా చెబుతున్నారు. కేటీఆర్‌ను ఈ లోపుగా ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎంను చేయరని రేవంత్ స్పష్టం చేస్తున్నారు. కేసీఆర్ వ్యూహాలపై స్పష్టమైన అవగాహనతో ఉన్న రేవంత్ .. వ్యాఖ్యలు ఇప్పుడు… ముందస్తు ఎన్నికలపై అందరిలోనూ మరింత చర్చకు కారణం అవుతున్నాయి. కేసీఆర్ సాధారణంగా.. . తన ఆలోచనల మేరకు ప్రజల్లో చర్చ జరగడానికి లీక్‌ల ద్వారా సమాచారాన్ని బయటకు పంపుతారు. ప్రజల్ని మానసికంగా సిద్ధం చేస్తారు. ఆ తర్వాత మాత్రమే నిర్ణయాన్ని ప్రకటిస్తారు. గతంలో అసెంబ్లీ రద్దు వ్యవహారంలోనూ ఇదే పద్దతి పాటించారు.
గతంలో జరిగిన ముందస్తు ఎన్నికల కారణంగా తెలంగాణలో ఎన్నికలు 2023 ద్వితీయార్థంలోనే జరగాల్సి ఉంది. ఈ సారి మరోఏడాది ముందుగానే కేసీఆర్ఎన్నికలకు ప్లాన్ చేసుకుంటున్నారన్న అభిప్రాయం మాత్రం అందరిలోనూ ఏర్పడుతోంది. ఈ దిశగా స్పష్టమైన నమ్మకంతో ఉన్న రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీని ఆ దిశగా సిద్ధం చేసుకుంటూ ఉంటారు. నమ్మితేఇతర పార్టీల నేతలూ అదే విధంగా రెడీ అవుతారు. ఓ రకంగా చూస్తే.. తెలంగాణలో ఎన్నికల కాలం ప్రారంభమైనట్లేనని చెప్పుకోవచ్చు.