తెలంగాణలోని కాంగ్రెస్ ఎంపీ సీట్లపై ప్రతిష్టంభన వీడటం లేదు. 17స్థానాలకుగాను 14స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినా… మరో మూడు స్థానాలపై సస్పెన్స్ కొనసాగుతోంది. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. గురువారం సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్ళడంతో పెండింగ్ స్థానాలపై స్పష్టత వస్తుందనే ప్రచారం జరుగుతోంది.
ఢిల్లీ పర్యటనలో పెండింగ్ లోని లోక్ సభ స్థానాలపై అధిష్టాన పెద్దలతో రేవంత్ చర్చించే అవకాశం ఉంది. ఈ పర్యటన తర్వాత మూడు స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా హైదరాబాద్ విషయంలో కాంగ్రెస్ పెద్దగా ఆలోచించడం లేదు. అలాగే, మాదిగ సామాజిక వర్గానికి ఒక్క టికెట్ కూడా ఇవ్వకపోవడంతో ఆ సామాజిక వర్గం కాంగ్రెస్ పై గుర్రుగా ఉంది. దీంతో హైదరాబాద్ నుంచి మాదిగ సామాజిక వర్గానికి టికెట్ కేటాయిస్తే ఎలా ఉంటుందన్న అంశంపై పార్టీ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన రెండు నియోజకవర్గాలపైనే కాంగ్రెస్ ఎటు నిర్ణయం తీసుకోలేకపోతోంది. కరీంనగర్ టికెట్ బీసీ అభ్యర్థికి ఇవ్వాలని డిమాండ్లు వస్తుండగా… ప్రవీణ్ రెడ్డి తనకు ఇవ్వాలని పట్టుబడుతుండటం కాంగ్రెస్ కు తలనొప్పిగా మారింది.
ఖమ్మం ఎంపీ టికెట్ భట్టి విక్రమార్క తన సతీమణికి ఇవ్వాలని.. పొంగులేటి తన సోదరుడికి ఇవ్వాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే తుమ్మల్ నాగేశ్వర్ రావు వ్యూహాత్మకంగా మండవ వెంకటేశ్వర్ రావును రేసులోకి తీసుకొచ్చారు. కమ్మ సామాజిక వర్గానికి ఒక్క టికెట్ ఇవ్వలేదని దాంతో ఖమ్మం నుంచి తన స్నేహితుడు మండవకు ఇవ్వాలని కోరుతున్నారు తుమ్మల. దీంతో ఈ మూడు స్థానాలపై రేవంత్ తాజా ఢిల్లీ పర్యటనతోనైనా క్లారిటీ వస్తుందా..? ఇంకా మరికొన్ని రోజులు నాన్చుతారా..? అనే పార్టీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.