పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తరువాత రాహుల్ గాంధీ అధ్యక్షతన తొలిసారిగా సీడబ్ల్యూసీ విస్తృత స్థాయి సమావేశం ఢిల్లీలో జరిగింది. పీసీసీ అధ్యక్షులు, ఇన్ ఛార్జ్లతోపాటు ముఖ్యమంత్రులూ, మాజీ ముఖ్యమంత్రులూ.. ఇలా మొత్తంగా దాదాపు 50కిపైగా ప్రముఖ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఎలా సమాయత్తం కావాలనే లక్ష్యంతో ఈ సమావేశం నిర్వహించారు. పొత్తుల విషయమై ఒక స్పష్టమైన అభిప్రాయం ఇక్కడ వ్యక్తమైంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాల్లో కొన్ని మార్పులు తప్పవని పి. చిదంబరం ప్రతిపాదించారు. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో మోడీ నాయకత్వంలోని ఎన్డీయేని ఎదుర్కోవడం కోసం అవసరమైతే కర్ణాటక ఫార్ములా ప్రకారం ఇతర పార్టీలను ముందు వరుసలో నిలబెట్టి మద్దతు ఇవ్వడానికి కూడా సిద్ధమని ఈ సమావేశంలో చర్చించడం విశేషం. దీంతోపాటు కొత్త పొత్తులకు ఆస్కారం ఉంటుందనే సంకేతాలిచ్చారు.
ఇక, ఆంధ్రా విషయానికొస్తే.. ప్రత్యేక హోదాకి తాము కట్టుబడి ఉన్నామని రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. ఈ సమావేశం విషయాలను ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి మీడియాకు వివరించారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమౌతోందన్నారు. 2019లో ప్రభుత్వం ఏర్పడగానే తాము తీసుకోబోయే మొదటి నిర్ణయం ప్రత్యేక హోదాతోపాటు, విభజన చట్టంలోని హామీలు అమలు చేయడమేనని రాహుల్ చెరప్పారని రఘువీరా చెప్పారు. ఆంధ్రాకి ఆదుకోవాల్సిన బాధ్యత తమ పార్టీ ఉందని రాహుల్ చెప్పారన్నారు. ఇదే విషయమై 29 రాష్ట్రాలకు చెందిన నేతలు కూడా ఏకగ్రీవంగా ఈ ప్రతిపాదనకు మద్దతు ప్రకటించారన్నారు.
ఆంధ్రా విషయంలో కేవలం ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలనే ప్రధాన ప్రచారాస్త్రాలుగా కాంగ్రెస్ ప్రయోగించబోతోందనేది మరోసారి స్పష్టమైంది. ఇక, పొత్తుల విషయమై కొత్త సమీకరణాలకు కూడా సిద్ధమని పార్టీ చెబుతున్న నేపథ్యంలో… ఆంధ్రా విషయంలో పొత్తులకు కాంగ్రెస్ సిద్ధమా కాదానే స్పష్టత ఇంకా రావాల్సి ఉంది. వాస్తవం మాట్లాడుకుంటే, సోలోగా పోటీ చేసినా నిర్ణయాత్మక ఫలితాలను సాధించే స్థాయిలో ఏపీ కాంగ్రెస్ ఇప్పటికి లేదు. ఎలాగూ రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన అజెండా అంటున్నారు, భాజపా సర్కారు ఆంధ్రాని మోసం చేసిందంటున్నారు. ఇవే లక్ష్యాలతో వచ్చే ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమౌతున్న పార్టీలు ఏపీలోనూ ఉన్నాయి. కాబట్టి, ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమౌతూ కొత్త ప్రయత్నాలేవైనా చేస్తుందేమో చూడాలి.