కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి శరాఘాతమే. దక్షిణాదిలో రెండు జాతీయ పార్టీలు హోరాహోరీగా తలపడుతున్న రాష్ట్రం ఒక్క కర్ణాటక మాత్రమే. సిద్ధరామయ్య సర్కారుపై ఉన్న వ్యతిరేకత కంటే… కేంద్రంపై ఉన్న వ్యతిరేకతే ఎక్కువగా ఉందని అందరూ అంచనా వేశారు. నోట్ల రద్దు,జీఎస్టీ, నిరంతరం పెరుగుతున్న పెట్రో ధరలతో.. సామాన్యుడి జీవితాన్ని నేరుగా ప్రభావితం చేసే అంశాల్లో ప్రధానమంత్రి కఠినంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రజల్లోనే సహజంగా వ్యతిరేకత వచ్చింది. ఇది కర్ణాటక ప్రచార సరళిలో కూడా కనిపించింది. కానీ కాంగ్రెస్ పార్టీ మొదట్లో కాస్తంత దూకుడు చూపించినా… తర్వాత అతి విశ్వాసంతోనో… పార్టీలోని గ్రూపుల కారణంగానో పట్టు సడలించింది. ఏ మాత్రం సందు దొరికినా… బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా దూసుకుపోతారు. కర్ణాటకలోనూ అదే చేశారు. కాంగ్రెస్‌ను అధికారానికి దూరం చేశారు.
కర్ణాటక ఫలితాలతో.. రాహుల్ గాంధీ నాయకత్వ సామర్థ్యంపై మరోసారి సందేహాలు ప్రారంభమయ్యాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తి మెజార్టీ సాధించకపోయినా.. అతి పెద్ద పార్టీగా అవతరించాలి. లేకపోతే … గ్రాండ్ ఓల్డ్ పార్టీకి నూకలు చెల్లే పరిస్థితి వస్తుంది. అంతకంటే ముందు నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఈ ఏడాది నవంబర్, డిసెంబర్లలో జరగనున్నాయి. ఇవి సుదీర్ఘంగా బీజేపీ అధీనంలో ఉన్న రాష్ట్రాలు. మధ్యప్రదేశ్,రాజస్థాన్ రెండు పార్టీలకు అత్యంత కీలకం. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభుత్వాలపై తీవ్ర ప్రజావ్యతిరేకత ఉంది. అది ఉపఎన్నికల్లో తేలిపోయింది. ఇప్పుడు ఆ వ్యతిరేకతను కాంగ్రెస్ తనకు అనుకూలంగా మార్చుకోగలుగుతుందా …?లేదా..? అన్నది అత్యంత ముఖ్యం.
కర్ణాటకలో ఇప్పుడు బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడానికి కాంగ్రెస్ ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తుందో అన్నది కూడా.. భవిష్యత్ రాజకీయాలకు కీలకం కానుంది. కాంగ్రెస్, జేడీఎస్‌లను చీల్చి అయినా సరే.. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తుంది. దీన్ని ఎంత సమర్థంగా ఎదుర్కొంటుంది అన్నదానిపై కూడా… కాంగ్రెస్ కూటమి రాజకీయ సమర్థత కూడా ఆధారపడి ఉంటుంది. జేడీఎస్‌కు ప్రభుత్వ ఏర్పాటు విషయంలో బీజేపీ నుంచి ఎటువంటి అడ్డంకులు రాకుండా చేయగలిగితే… అది కాంగ్రెస్‌కు ప్లస్ పాయింటే. కానీ పోల్ మేనేజ్మెంట్లో కానీ.. ఎమ్మెల్యేల బేరసారాల్లో కానీ.. బీజేపీని నిలువరించే సామర్థ్యం కాంగ్రెస్‌కు ఉందా అన్నదే సందేహం. గోవా. మేఘాలయ, మణిపూర్ లాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ..సీట్ల పరంగా అతి పెద్ద పార్టీగా అవతరించినా… ప్రభుత్వాలను మాత్రం బీజేపీ ఏర్పాటు చేయడమే దీనికి కారణం.
ఈ పరిణామాలన్నింటిని చూస్తూంటే.. కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికలను ఎలా ఎదుర్కొంటుందన్నది ఆసక్తికరంగా మారింది. రాహుల్ గాంధీ.. ప్రచారసరళిలో మార్పులు చేసుకున్నారు. గతంతో పోలిస్తే కొంత వరకు ప్రజామోదం పొందగలిగారు. కానీ.. అది సరిపోదు. మోదీ ..రాజకీయ వ్యూహాల ముందు ఇప్పటికైతే రాహుల్ తేలిపోతున్నాడు. కర్ణటాకలో సిద్ధరామయ్యే… కాంగ్రెస్‌ను అన్నీ తానై నడిపారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పాత్ర పోషించాల్సింది రాహులే. వేరే ప్రత్యామ్నాయం లేదు. మరి కాంగ్రెస్ దానికి అనుగుణం సిద్ధమవుతుందా..? ప్రజల దయ అని చేతులెత్తేస్తుందా..?