రఘురామకృష్ణ రాజు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్. నాలుగున్నరేళ్లుగా ఆయన వైఎస్ఆర్సీపీపై, జగన్ మోహన్ రెడ్డిపై పోరాడారు. సొంత నియోజకవర్గానికి వెళ్తే ఏదో ఓ కేసులో అరెస్టు చేసి హింసిస్తారన్న కారణంగా ఇటీవలి కాలం వరకూ ఆయన సొంత నియోజకవర్గానికీ వెళ్లలేకపోయారు. తాను ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని.. నర్సాపురం నుంచేనని చెబుతూ వస్తున్నారు. పొత్తులు ఉంటాయని.. ఏ పార్టీకి సీటు దక్కితే ఆ పార్టీ నుంచి పోటీ చేస్తానని ఆయన చెబుతూ వస్తున్నారు. కానీ చివరికి ఆయన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఇప్పుడు ఆయనేం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
జగన్ ను వ్యతిరేకించే వర్గాల్లో రఘురామకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అందులో సందేహం లేదు. ఆయనకు టిక్కెట్ ఇవ్వడం అంటే.. ప్రాణాలకు తెగించి జగన్ పై పోరాడిన నేతకు గౌరవం ఇవ్వడమేనన్న అభిప్రాయం ఉంది. అందుకే టీడీపీ ఆయనకు టిక్కెట్ ఇచ్చే విషయంలో అనేక సమీకరణాలు చూసుకుంటోంది. నర్సాపురం తప్ప రఘురామకు సరిపోయే సీటు లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే ఆయనను అసెంబ్లీకి తీసుకు వస్తే ఎలా ఉంటుందన్న చర్చ ప్రస్తుతం టీడీపీలో జరుగుతోంది. కానీ ఇప్పటికే అన్నిసీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించారు. ఇప్పుడు సాధ్యమా లేదా అన్నది అర్థం కాని విషయం.
కానీ రఘురామకు అంతకు మించిన ఆప్షన్ ఉంది.. అది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీనే అంటి పెట్టుకుని కేవీపీ రామచంద్రరావు ఉన్నారు. ఆయన రఘురామ వియ్యంకుడు కూడా. రఘురామకు ఉన్న క్రేజ్.. ఆయన కాన్పిడెన్స్.. ప్రకారం కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా.. నర్సాపురంలో గట్టి పోటీ ఇస్తారన్న అభిప్రాయం ఉంది. ప్రస్తుతం బీజేపీ, వైసీపీ అభ్యర్థులు ఇద్దరూ అంత పలుకుబడి ఉన్న వారు కాకపోవడం.. రఘురామ సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయ్యే చాన్స్ ఉంది. అది ఆయనకు ప్లస్ అవుతుంది. రఘురామరాజు ఏ నిర్ణయం తీసుకుంటారో ?