హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ళకుపైగా సమయం ఉండగా రానున్న ప్రభుత్వంగురించి అప్పుడే ఊహాగానం చేయటం తొందరపాటు(టూ ఎర్లీ) అనిపించినా ప్రస్తుత పరిస్థితులు అలా ఆలోచించేలా చేస్తున్నాయని చెప్పక తప్పదు. దీనికిగానూ ముందు కేసీఆర్ ప్రభుత్వ పాలనను, తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ పనితీరును ఒకసారి బేరీజు వేయాలి.
అరవై ఏళ్ళ సీమాంధ్ర నాయకుల పాలననుంచి బయటపడిన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానన్న మాటలను నమ్మి ప్రజలు కేసీఆర్‌కు అధికారాన్ని కట్టబెట్టారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్, మూడెకరాల పొలం, కోటి ఎకరాలకు సాగునీరు, లక్షా 25వేల ఉద్యోగాలు, ముస్లిమ్‌లకు 12శాతం రిజర్వేషన్లు, నిరంతర విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తానని, అవినీతికి తావులేకుండా చేస్తానని ఎన్నికలకు ముందు; అధికారంలోకొచ్చిన తర్వాత – హైదరాబాద్ నగరంలోని పేదలందరికీ ఆకాశహర్మ్యాలను(టవర్స్) నిర్మించి గృహవసతి కల్పిస్తానని, వాటర్ గ్రిడ్ నిర్మించి రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నాలుగేళ్ళలో నల్లా ఏర్పాటు చేయిస్తాననంటూ పలు వాగ్దానాలు చేశారు. ఈ హామీలన్నింటినీ కేసీఆర్ నెరవేరుస్తారన్న నమ్మకం ఉన్నా, లేకపోయినా – ఆంధ్రా నాయకుల పాలనకంటే మెరుగుగా ఉంటుందనయితే తెలంగాణ ప్రజలు భావించారు.
కానీ జరుగుతున్నదేమిటి? తెలంగాణ బిడ్డ పాలనలోకి వచ్చిన తర్వాత హాయిగా ఉందనే పరిస్థితి పక్కన పెట్టండి, అంతా సజావుగా సాగుతోందనే భావనకూడా ప్రజలకు కల్పించలేకపోతోంది ప్రభుత్వం. అనాలోచిత, అహంకారపూరిత ధోరణులతో కేసీఆర్ పాలన సాగుతోంది. గత ఏడాది సరైన కరెంట్ లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేసినా పట్టించుకున్న పాపాన పోలేేదు. ఉస్మానియా విద్యార్థులు ఉద్యోగల భర్తీపై రోజులతరబడి ఆందోళన చేస్తే ప్రభుత్వంనుంచి పలకరించినవారు లేరు. రోజు రోజుకూ వివాదాస్పద నిర్ణయాలను తీసుకుంటూ వ్యతిరేకతను కేసీఆర్ మూటకట్టుకుంటున్నారు. తనపై పోరాడటానికి స్వయంగా తానే ప్రతిపక్షాలకు ‘చీప్ లిక్కర్’లాంటి ఆయుధాలు అందిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో మొదటిసారి మాట్లాడుతూ, ప్రతిపక్షాలను కలుపుకెళతానన్న కేసీఆర్ – దానికి పూర్తి విరుద్ధంగా విపక్షాలను పురుగులను చూసినట్లు చూస్తున్నారు. ఒకవేళ ప్రతిపక్షాలను కలుపుకెళ్ళటమంటే ఆయన అర్థం ఆ పార్టీలలోని ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లోకి ఆకర్షించటమేమోనని ఇప్పుడు సందేహం కలుగుతోంది. ఆ ఆకర్ష కార్యక్రమం కేసీఆర్ సహజ వ్యవహారశైలిలాగానే దబాయింపులాగా ఉందిగానీ ఏమాత్రం నైతిక ప్రమాణాలకు అనుగుణంగా లేదనేది ఎవరూ కాదనలేని విషయం. తెలంగాణ ఉద్యమంలో ఒక్కరోజుకూడా పాల్గొనని ఇతర పార్టీల నాయకులను టీఆర్ఎస్లోకి తీసుకుని కీలక పదవులు కట్టబెట్టటాన్ని సొంతపార్టీలోని నేతలే విమర్శిస్తున్నారు. ఈ అసంతృప్తి రోజురోజుకూ పెరిగిపోతోందన్న వాదన వినిపిస్తోంది. ఇక కుటుంబ పాలన అనే విమర్శ ఉండనే ఉంది. పార్టీలో, ప్రభుత్వంలో కీలక బాధ్యతలన్నీ కుటుంబంలోనివారే నిర్వర్తిస్తున్న సంగతి విదితమే. వారుతప్ప ప్రభుత్వంలో మిగిలిన మంత్రులందరూ డమ్మీలేనని విమర్శలుకూడా వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షాలే కాదు, తనను ఎదిరించే ప్రతివారినీ కేసీఆర్ అలాగే ట్రీట్ చేస్తున్నారు. సమ్మె చేస్తున్న పంచాయతీ, మున్సిపల్ పారిశుధ్య కార్మికులపై మండిపడ్డారు. వారివి పనికిమాలిన సమ్మెలన్నారు. ఒక్కోసారేమో వరాలిచ్చే దేవుడిలా – అడిగినవాళ్ళకి అడిగినంత… అడిగినదానికంటే ఎక్కువగా వరాలు గుప్పించటం, తనకు, తన మంత్రులకు, పోలీస్, ఫారెస్ట్ అధికారులకు భారీస్థాయిలో వాహనాలు కొనుగోలు చేయటంవంటి చర్యలు చూస్తుంటే కేసీఆర్ తనను తాను ఒక సార్వభౌముడిగానో, చక్రవర్తిగానో భావించుకుంటున్నట్లుగా అనిపిస్తోంది.
అధికారం ఒక మత్తులాంటిదని అంటారు. అధికారంలో కొనసాగేకొద్దీ సాధారణంగా ప్రజలకు, వారి సమస్యలకు దూరంగా జరుగుతుంటారు పాలకులు. అందుకోసమే కొందరు పాలకులు రోజులోనో, వారంలోనో ఒక నిర్దిష్ట సమయంలో ప్రజలతో దర్బార్ ఏర్పాటుచేసుకుంటుంటారు. మరి తెలంగాణలో సామాన్యప్రజల సంగతి పక్కన పెట్టండి… సొంతపార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకుకూడా కేసీఆర్ అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి ఉందని అందరూ బాహాటంగా చెప్పుకుంటున్నారు. ఇక సచివాలయం సంగతి సరేసరి. ముఖ్యమంత్రి నెలల తరబడి సచివాలయానికి వెళ్ళకపోవటంతో ఫైళ్ళు బస్తాలకు బస్తాలు పేరుకుపోతున్నాయి.
ఇక తెలంగాణలో ప్రతిపక్షాలను గమనిస్తే, కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీలలో – తెలుగుదేశం పార్టీ ఓటుకు నోటు కేసుతో భారీగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. గతంలో కేసీఆర్‌పై నిప్పులు చెరుగుతూ కడిగిపారేసే రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారు. ఈమధ్య పుంజుకుని మళ్ళీ విమర్శలు చేస్తున్నప్పటికీ నైతికంగా పార్టీమీద మచ్చ ఏర్పడింది. భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లో ఏదైనా ఆందోళన చేస్తూ అప్పుడప్పుడూ తళుక్కుమని మెరవటం తప్పితే క్షేత్రస్థాయిలో బలంగా పోరాడటంలేదు. సీనియర్ నేత నాగం జనార్దనరెడ్డి ఆ పార్టీలో ఉన్నారో, లేదో తెలియని పరిస్థితి. తెలంగాణలో బీజేపీ పనితీరు, నాయకత్వంతీరు అంత పటిష్ఠంగా అయితే లేదు.
మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ పనితీరు గమనిస్తుంటే 2019 ఎన్నికల్లో అధికారపగ్గాలు చేజిక్కించుకనేదిశగా దూసుకెళుతోందా అన్న భావన కలగకమానటంలేదు. ప్రభుత్వ తప్పిదాలు, లోపాలపై ఏదో ఒకదానిని తీసుకుని ప్రతిరోజూ కాంగ్రెస్ నాయకులు రోడ్డెక్కుతున్నారు. మున్సిపల్ కార్మికుల సమ్మెగురించిగానీ, చీప్ లిక్కర్ గురించిగానీ, ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్ట్ గురించిగానీ, తోటపల్లి ప్రాజెక్ట్ గురించిగానీ, నిత్యావసర వస్తువుల ధరలగురించిగానీ, ముస్లిమ్ రిజర్వేషన్ల గురించిగానీ, రైతుల ఆత్మహత్యలగురించిగానీ కాంగ్రెస్ ఆందోళన లేని రోజంటూ దాదాపుగా లేదనే చెప్పాలి. నిజానికి ప్రతిపక్షమంటే చేయాల్సింది అదే. ప్రభుత్వలోపాలను ఎండగట్టటం, తప్పులను ఎత్తిచూపటం. ఆ పనిని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బాగా నిర్వర్తిస్తోందని చెప్పాలి. వాస్తవానికి తెలంగాణను తెచ్చింది, ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినాకూడా 2014 ఎన్నికలలో దానిని ఓట్లరూపంలో సరిగా మార్చుకోలేకపోవటానికి నాటి పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఒక కారణమని చెప్పాలి. ఆయన పార్టీలోని వివిధ వర్గాలను ఒక్కతాటిమీదకు తీసుకురాలేకపోయారు, అభ్యర్థుల ఎంపికకూడా సరిగా చేయలేకపోయారు. ఆయన వారసులుగా వచ్చిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కమాత్రం – పగ్గాలు చేపట్టిననాటినుంచి తమ ముద్రను చూపిస్తున్నారు. అన్ని జిల్లాలూ తిరుగుతూ పార్టీలోని అన్ని వర్గాలనూ కలుపుకుపోవటానికి ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ తన ధోరణి మార్చుకోకుండా ఉండి, కాంగ్రెస్ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఇదే ఊపును, ఉత్సాహాన్ని కొనసాగిస్తేమాత్రం 2019 అసెంబ్లీ ఎన్నికలలో హస్తం విజయం అనివార్యమని ఆ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కేసీఆర్ ఇదే ధోరణి కొనసాగిస్తేమాత్రం వారి వాదన నిజమవకుండా ఎవరూ ఆపలేరు.