కాంగ్రెస్ పార్టీని దేశప్రజలందరూ తిరస్కరించిన సమయంలో కూడా తెలుగు ప్రజలు దానిని నెత్తిన పెట్టుకొని ఆదరించారు. కానీ వారి అభిప్రాయాలకు ఏమాత్రం విలువ ఈయకుండా తన ఇష్టం వచ్చినట్లుగా రాష్ట్ర విభజన చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు తెలంగాణా ప్రజలు కూడా దానిని తిరస్కరించారు. అప్పటి నుంచి రెండు రాష్ట్రాలలో మళ్ళీ బలపడేందుకు కాంగ్రెస్ పార్టీ ఎంతగా ప్రయత్నిస్తున్నా దాని పరిస్థితి నానాటికీ క్షీణిస్తోందే కాస్తయినా మెరుగపడలేదు. తెలంగాణాలో తెరాస కారణంగానే అది నిర్వీర్యం అవుతుంటే, ఆంధ్రాలో మాత్రం దాని స్వయంకృతాపరాధం కారణంగానే అది నిర్వీర్యం అవుతోంది. తెలంగాణాలో మళ్ళీ కోలుకొనే అవకాశం ఉందేమో గానీ ఆంధ్రాలో మాత్రం ఇప్పట్లో అటువంటి అవకాశాలు కనబడటం లేదు.
రాష్ట్ర విభజన జరిగి రెండేళ్ళు పూర్తయినా నేటికీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మెరుగుపడలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు, సంబంధాలే అందుకు కారణం కావచ్చు కానీ, ఈ దుస్థితికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా తెదేపా నేతలు చేస్తున్న విమర్శలు ప్రజలకు బాగా చేరుతున్నాయి. ఒకవేళ ఈ రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి సాధించి ఉండి ఉంటే, బహుశః రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని క్షమించి ఉండేవారేమో? కారణాలు ఏవైనప్పటికీ ఆశించినంతగా అభివృద్ధి జరుగకపోవడం చేత, కాంగ్రెస్ పార్టీపై తెదేపా నేతలు చేస్తున్న విమర్శలు ప్రజల మనసుల్లో ఆ గాయాన్ని మానకుండా చేస్తున్నాయని భావించవచ్చు.
కనుక ఈ సమస్య నుంచి బయటపడటానికి కాంగ్రెస్ పార్టీ వద్ద ఉన్న ఏకైక అస్త్రం విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలు కోసం పోరాడుతూ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలు చేయడం. ఈ విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, అది రెండు లోపాలను అధిగమించలేకపోతున్న కారణంగానే ప్రజలకు చేరువ కాలేకపోతోంది.
1. రాష్ట్ర కాంగ్రెస్ నేతలందరూ సమిష్టి పోరాటం చేయకపోవడం.
2. వైకాపాకి చేరువవ్వాలనే ఉద్దేశ్యంతో మద్యమద్యలో తన పోరాటాలను జగన్మోహన్ రెడ్డికి అప్పగించి సైలెంట్ అయిపోతుండటం.
ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంటే రఘువీరా రెడ్డి ఒక్కరే కనిపిస్తున్నారు. మహా అయితే ఆయన వెనుక సి.రామచంద్రయ్య, అప్పుడప్పుడు శైలజానాథ్ కనిపిస్తుంటారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిత్యం మీడియా ముందుకి వచ్చి హడావుడి చేసే చిరంజీవి, కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మి, పళ్ళం రాజు వంటి అనేకమంది సీనియర్ నేతలు ప్రేక్షకపాత్రకే పరిమితం అయ్యారు. పార్టీ వలన ఎంతో మేలు పొందిన చిరంజీవికి కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి దానికి మళ్ళీ జవజీవాలు పోయగలిగే శక్తి ఉన్నప్పటికీ, ఆయన తన 151వ సినిమా షూటింగ్ గురించి మాత్రమే ఆలోచిస్తుండటం ఆ పార్టీ దురదృష్టం.
తెదేపా, భాజపాలు తెగతెంపులు చేసుకొంటే భాజపాతో జత కట్టాలని జగన్మోహన్ రెడ్డి ఆశగా ఎదురుచూస్తుంటే, ఏనాటికైనా జగన్ మనసు కరుగదా…తమతో జత కట్టడానికి అంగీకరించడా…అని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆశగా ఎదురుచూస్తోంది.
అందుకే ప్రత్యేక హోదా, తెలంగాణా ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ తను ఉదృతంగా చేస్తున్న పోరాటాలని జగన్మోహన్ రెడ్డి చేతికి అప్పగించి ఆయన మెప్పు పొందాలని ప్రయత్నిస్తోంది. కానీ ఆయన కూడా ఆ పోరాటాలను విజయవంతంగా కొనసాగించలేక చతికిలపడుతుండటంతో రెండు పార్టీలు కూడా నష్టపోతున్నాయి. ఒకవేళ మున్ముందు రాజకీయ సమీకరణాలు మారి, ఆయన కాంగ్రెస్ పార్టీకి శత్రువైన భాజపాతో చేతులు కలిపినట్లయితే, ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ చేసిన త్యాగాలు వృధా అవడమే కాకుండా, అది చేసిన, చేస్తున్న పోరాటాలవలన ఆశించిన ప్రయోజనం కూడా పొందలేదు. కనుక కాంగ్రెస్ పార్టీ జగన్ పై ఆశలు పెట్టుకోకుండా, చిరంజీవి వంటి నేతలందరినీ తప్పనిసరిగా ముందుకు తీసుకువచ్చి నిరంతర పోరాటాలు చేసినప్పుడే అది ప్రజలకు చేరువ కాగలదు. లేకుంటే ఎన్నేళ్ళయినా దాని పరిస్థితిలో మార్పు రాదు.