కేంద్రం నుంచి ఆంధ్రాకి రావాల్సిన నిధులుగానీ, కేటాయింపులుగానీ చాలానే ఉన్నాయి. నిజానికి, వాటిని రప్పించే బాధ్యత ఎంపీలకు ఉంటుంది. పార్లమెంటులో ఒత్తిడి తేవాల్సింది వారే! గతంతో పోల్చుకుంటే టీడీపీ ఎంపీలు కాస్త యాక్టివ్ గానే ఉన్నారు. అయితే.. వారి ఆతృత అంతా నియోజక వర్గాల పునర్విభజనపైనే ఉందని మరోసారి స్పష్టమైంది. ఆ మధ్య కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుతో ఏపీ ఎంపీలు సమావేశమయ్యారు. ఆ సందర్భంలోనూ నియోజక వర్గాల పునర్విభజన త్వరగా చేపట్టాలని కోరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే ప్రక్రియపై తెలుగుదేశం నాయకులు కొండంత ఆశలు పెట్టుకున్నట్టు సమాచారం!
ఫిరాయింపుదారులకు భరోసా కల్పించాలంటే ముందుగా పునర్విభజన జరగాల్సిందే కదా! ఎందుకంటే, ఇప్పటికే తెలుగుదేశంలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయి. వచ్చే ఎన్నికల నాటికి తమ ప్రాధాన్యత ఏమిటో ఎక్కడో అనేది చాలామంది ఫిరాయింపుదారులకు అర్థం కావడం లేదు. ఇంకోపక్క టీడీపీలో సీనియర్లు కూడా ఫిరాయింపుల వల్ల అసంతృప్తిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరందరిలోనూ భరోసా పెంచేలా పార్టీ తీవ్ర ప్రయత్నం చేస్తోందన్న సంకేతాలు ఇస్తున్నారు కేంద్రమంత్రి సుజనా చౌదరి!
మరో నెలరోజుల్లోనే నియోజక వర్గాల పునర్విభజన ఉంటుందని ఆయన స్పష్టం చేశారు! ఇదేమాట తెలుగుదేశం నేతలతో ఆయన చెబుతున్నారట. అలాగని టీడీపీ నేతలు దిల్ ఖుష్ కావడం లేదు. ఎందుకంటే, ఇంకోపక్క రాష్ట్ర భాజపా అధ్యక్షుడి అభిప్రాయం మరోలా ఉంది. పునర్విభజన జరగాలంటే రాజ్యాంగ సవరణ అవసరం ఉంటుందని హరిబాబు అంటున్నారు. ముందుగా రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాలని అటార్నీ జనరల్ అభిప్రాయపడ్డారని ఆయన చెప్పారు. ఈ ప్రక్రియకు చాలా సమయం పట్టేలా ఉందన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. అయితే, ఇక్కడ గమనించాల్సిన మరో విషయం… ప్రస్తుతం పునర్విభజనపై పట్టుబడుతున్నది కేవలం తెలుగు రాష్ట్రాలు మాత్రమే. ఇదే పనిగా పెట్టుకున్నది తెలుగుదేశం ఎంపీలు మాత్రమే.
దీంతో ఫిరాయింపు టీడీపీ నేతల్లో కాస్తంత గందరగోళం నెలకొందని సమాచారం. వచ్చే నెలలో ప్రక్రియ స్టార్ట్ అని సుజనా అనడం, కాస్త టైం పట్టేలా ఉందని హరిబాబు సంకేతాలివ్వడం… రెండూ ఒకేసారి జరిగేసరికి మరోసారి కన్ఫ్యూజన్ లో పడుతున్నారు ఫిరాయింపు తెలుగు తమ్ముళ్లు! ఇప్పట్లో పునర్విభజన ఉంటుందా ఉండదా అనేది చర్చనీయాంశంగా మారిపోయింది. నిజానికి, సుజనా మాటల్ని నమ్మే పరిస్థితి లేదనే చెప్పాలి. ఎందుకంటే, ప్రత్యేక హోదా విషయంలో కూడా ఆయన ఇలానే మాట్లాడేవారు. వచ్చేస్తోందీ, కేంద్రం ఇచ్చేస్తోందనే చెప్పేవారు. చివరికి ఏమైందీ.. ఏమీ కాలేదు! కాబట్టి, సంఖ్య పెరుగుతుందని సుజనా చెప్పినా కూడా ఫిరాయింపుదారులకు అది అనునయింపు వ్యాఖ్యగా వినిపించడం లేదు. మొత్తానికి, టీడీపీ కిం కర్తవ్యం… నియోజక వర్గాల సంఖ్య పెంచుకోవడమే..! ఇక, రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులూ కేటాయింపులూ అవన్నీ తరువాత మాట్లాడుకుందాం అన్నట్టుగానే ఎంపీల ధోరణి ఉంటోంది.