ఢిల్లీ శివార్లలో రైతుల ఆందోళన తారస్థాయికి చేరింది. ప్రాణాలైనా అర్పిస్తాం కానీ వెనక్కి తగ్గబోమని రైతులు కుండబద్దలు కొడుతున్నారు. ధర్నా చేస్తున్న వారిలో ఇరవై మంది వరకూ రైతులు చనిపోయారు. కేంద్రం మత్రం.. రైతుల డిమాండ్లపై స్పందించే ప్రశ్నే లేదని తేల్చి చెబుతోంది. వారి అభ్యంతరాలన్నీ.. ఉత్తవేనని.. తీసి పారేస్తోంది. నిన్నటిదాకా రైతుల్ని గౌరవించినట్లుగా వ్యవహరించిన ప్రభుత్వం ఇప్పుడు… వారిపై వేర్పాటు వాద ముద్ర వేస్తోంది. ఓ సారి ఖలిస్తాన్ అని..మరోసారి చైనా, పాకిస్తాన్ ఉన్నాయనే మాటలు మాట్లాడటం ప్రారంభించారు. తాజాగా… ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా రైతులను విపక్షాలు రెచ్చ గొడుతున్నాయని ఆరోపించారు.
అయితే రైతు సంఘాలు ఒక్కటే డిమాండ్ చేస్తున్నాయి. చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి. మేధావులు… వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న ఇతరులు.. మద్దతు ధరపై చట్టం చేయాలని సూచిస్తున్నాయి. ప్రస్తుతం కేంద్రం ఆమోదించిన వ్యవసాయ చట్టాల్లో కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైన నిబంధనలు ఉన్నాయి. వాటితో ఏమైనా వివాదాలు ఏర్పడితే.. సామాన్య రైతు న్యాయాన్ని పొందడం సాధ్యం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు… కనీస మద్దతు ధరకు చట్టం చేయమని కోరుతున్నారు. రైతుల వద్దకు ఎవరైనా వచ్చి కొనుగోలు చేయవచ్చని.. కానీ ఆ కొనుగోలు ఖచ్చితంగా మద్దతు ధర ఇచ్చి చేయాలన్న నిబంధన చట్టంలో చేర్చాలని కోరుతున్నారు. కానీ కేంద్రం మాత్రం ఈ డిమాండ్‌పై సానుకూలంగా లేదు. స్పందించడం లేదు.
వ్యవసాయంలోకి కార్పొరేట్ సంస్థలు వచ్చి.. ప్రభుత్వం కొనుగోలు తగ్గిస్తే.. రైతులు వారి గుప్పిట్లో చిక్కుకుంటారనేదే ప్రస్తుతం ఆందోళన. మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తే.. రైతుల్లో ఆందోళన చాలా వరకు తగ్గిపోతుందని అంచనా వేస్తున్నారు. మద్దతు ధర ప్రకటిస్తే.. అంత కన్నా తక్కువకు కొనుగోలు చేయడం సాధ్యం కాదు.. అంత కన్నా ఎక్కువ డిమాండ్ ఉంటే.. రైతులు ఎక్కువ ధరకు అమ్మకుంటారు. కానీ కేంద్రం మాత్రం మద్దతు ధరకు చట్టబద్ధత అనేది లేదని వాదిస్తోంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ.. మద్దతు ధరకు చట్టబద్ధత ఇవ్వలేదని కిషన్ రెడ్డి లాంటి వాళ్లు చెబుతున్నారు. వ్యవసాయ చట్టాలు కూడా అప్పుడు లేవని.. ఇప్పుడే తెచ్చారని రైతులు అంటున్నారు. మొత్తానికి కేంద్రం తీరుకూడా రైతుల్లో ఆందోళన పెరగడానికి ఓ కారణంగా కనిపిస్తోంది.