దళిత బంధు పథకంతో మూడో సారి అధికారంలోకి రావాలనుకుంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఆ పథకమే గుదిబండగా మారనుందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో అంతకంతకూ బలపడుతోంది. ఈ పథకం అమలు విషయంలో కేసీఆర్ ఇప్పటికీ ఓ స్పష్టమైన విధానపరమైన నిర్ణయం ప్రకటించలేదు. అందరికీ పథకం వర్తిస్తుందని చెబుతున్నారు. చివరికి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇస్తామంటున్నారు. ఏ ప్రతిపాదిన ఇస్తారు.. ఎలా ఇస్తారు.. నిధులెక్కడి నుంచి వస్తాయన్నదానిపై ఆయన స్పష్టత ఇవ్వడం లేదు. ఒక్కోసారి పాక్షిక అమలు అంటారు.. ఇంకోసారి అందరికీ ఇస్తామంటారు. దీంతో ప్రజల్లో అనేకానేక సందేహాలు ప్రారంభమవుతున్నాయి.
చెప్పినట్లుగా అందరికీ ఇవ్వకపోతే దళితుల్లో అసంతృప్తి..!
దళిత బంధు పథకాన్ని ఆలస్యం కాకుండా తెలంగాణ వ్యాప్తంగా దళితులకూ పథకాన్ని అందించాల్సి ఉంది. తెలంగాణలో 18శాతం వరకూ ఉన్న దళిత కుటుంబాలు అందరికీ పథకం వర్తింప చేయడం ఆర్థిక పరంగా అసాధ్యం. ఒక్క హుజురాబాద్‌లో అమలు చేయడానికే ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. ఉప ఎన్నిక జరుగుతున్న హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో అందరికీ అమలు చేసి, మిగిలిన 118 నియోజకవర్గాల్లో కేవలం 100 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేస్తే, ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో అర్హులైన ఇతర దళితులు ప్రభుత్వంపై తిరగబడే ప్రమాదం ఉంది. అందకే కేసీఆర్ అందరికీ ఇస్తామని చెబుతున్నారు. కానీ నమ్మించడం అంత తేలిక కాదు.
దళితులకు మాత్రమే ఇస్తే ఇతరులందరిలోనూ అసంతృప్తి..!
ఇప్పటికే దళితేతర వర్గాల నుంచి మాకు కూడా ఓ బంధు కావాల్న డిమాండ్ పెరుగుతోంది. రూ.10 లక్షల చొప్పున నగదు పంపిణీ అనే సరికి ప్రతీ కుటుంబం ఆశ పడటం సహజం. అలాంటి ఆశ అంతకంతకూ కుటుంబాల్లో పెరుగుతోంది. ఇతర రాజకీయ పార్టీలు దీన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. అంటే… ఇతర వర్గాలకూ ఏదో ఓ పథకాన్ని ప్రవేశ పెట్టక తప్పదు. వారికి ఎలాంటి లబ్ది చేకూర్చకపోతే.. వారంతా వ్యతిరేకమయ్యే ప్రమాదం ఉంది. వీటన్నింటిని కేసీఆర్ సమర్థంగా డీల్ చేయాల్సి ఉంది. లేకపోతే అన్ని వర్గాలకూ వ్యతిరేకమయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఒక్క వర్గానికే సాయం చేస్తామంటే ఇతర వర్గాలు అసంతృప్తి చెందుతాయి.. ఆ వర్గానికి పూర్తి స్థాయిలో అమలు చేయకపోతే ఆ లక్ష్యమూ నెరవేరదు.
పులి మీద స్వారీ అని కడియం అంటున్నది అందుకే..!
కేసీఆర్ రాజకీయ వ్యూహాల సామర్థ్యంపై అందరికీ నమ్మకం ఉంది కానీ.. రాజకీయాల్లో పరిస్థితులు కూడా కలసి రావాలి. లేకపోతే.. అటు దళితులఓట్లు.. ఇటు ఇతర వర్గాల ఓట్లు మొత్తం కోల్పోయే పరిస్థితి వస్తుంది. అదే జరిగితే దళిత బంధు కారణగానే ఓడిపోయారని తర్వాత విశ్లేషించుకోవాల్సి వస్తుంది. టీఆర్ఎస్ నేతలు ఈ విషయంలోనే టెన్షన్‌కు గురవుతున్నారు. అందుకే కడియం శ్రీహరి లాంటి వాళ్లు పులి మీద స్వారీ చేస్తున్నామని మీడియా ముందే చెబుతున్నారు.