ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో కీలక పదవుల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రధానంగా అడ్వకేట్ జనరల్ నియామకంపై పార్టీ ముఖ్యులతో చంద్రబాబు సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
పలువురి పేర్లను పరిశీలించిన చంద్రబాబు, టీడీపీ హాయాంలో ఏజీగా ఉన్న దమ్మాలపాటి శ్రీనివాస్ నే తిరిగి అడ్వకేట్ జనరల్ గా నియమించాలనే ఆలోచనతో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. 2019 లో వైసీపీ అధికారంలోకి వచ్చాక పదవికి దమ్మాలపాటి శ్రీనివాస్ రాజీనామా చేయగా ఆయనను టార్గెట్ చేసుకొని వైసీపీ వేధించినట్లు విమర్శలు వచ్చాయి. రాజధాని ప్రాంతంలో దమ్మాలపాటి శ్రీనివాస్ కు భూములు ఉన్నాయని… ఇందులో అవకతవకలు చోటు చేసుకున్నాయని కేసులు కూడా నమోదు అయ్యాయి. కుటుంబ సభ్యులపై కూడా కేసులు నమోదు చేసి దమ్మాలపాటి శ్రీనివాస్ ను మానసికంగా వేధించారు.
స్వతహాగా సీనియర్ అడ్వకేట్ కావడంతో ఆయనపై నమోదైన కేసులను ఆయనే వాదించుకొని ఈ కేసుల నుంచి బయటపడ్డారు. అలాగే, టీడీపీలోని కీలక నేతలపై కేసులను హైకోర్టులో దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు. ఇప్పటికీ పలు పెండింగ్ కేసుల్లో టీడీపీ నేతల తరుఫున ఆయనే వాదిస్తున్నారు. దీంతో దమ్మాలపాటి శ్రీనివాస్ నే మళ్లీ అడ్వకేట్ జనరల్ గా నియమించే అంశాన్ని చంద్రబాబు పరిశీలిస్తున్నారని..త్వరలోనే దీనిపై చర్చించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.