బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు కత్తి వేలాడుతోంది. పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ లో చేరడమే కాకుండా పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ అభ్యర్థిగా పోటీ చేయడంతో ఆయనపై అనర్హత వేటు పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని, లేదంటే సుమోటోగా విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేయడంతో …స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.
స్పీకర్ నిర్ణయం ఎలా ఉండనున్నా..దానం నాగేందర్ తో రాజీనామా చేయించడమే ఉత్తమం అని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు వేచి ఉండక ముందే రాజీనామా చేయించాలనేది కాంగ్రెస్ ఆలోచన. కానీ, దానం నాగేందర్ అందుకు సుముఖంగా ఉన్నారా? అనేది మరో చర్చ. 2004 అసెంబ్లీ ఎన్నికల సమయంలో దానం కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలో చేరాడు. ఆసిఫ్‌నగర్ నుండి టీడీపీ టికెట్‌పై గెలిచిన తరువాత, తన సీటుకు రాజీనామా చేశాడు. ఆ సమయంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఓడిపోయాడు.
గత పరిణామాల దృష్ట్యా రాజీనామాపై దానం నాగేందర్ తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల్లో ఓడితే పొలిటికల్ కెరీర్ ప్రమాదంలో పడుతుంది అనేది దానం ఆలోచన. పైగా నియోజకవర్గంలో దానం గ్రాఫ్ కూడా పడిపోయింది. దాంతో రాజీనామా చేసేందుకు దానం సంకోచిస్తున్నట్లుగా రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఏదీ , ఏమైనా పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో మాత్రం అనర్హత వేటు విషయంలో దానంకు ఎక్కువ రిస్క్ ఉందని అంటున్నారు.