ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమాన్ని వదిలేసి అస్త్ర సన్యాసం చేస్తానని ప్రకటించాక ఆయన పై సోషల్ మీడియాలో ఓ వైపు విమర్శలు వెల్లువెత్తుతూ ఉండగా, మరొకవైపు కాపు ఉద్యమ భవిష్యత్తు ఏంటన్న చర్చ ఆ సామాజిక వర్గం లో జోరుగా నడుస్తోంది. అయితే ఏ రాజకీయ పార్టీకి చెందకుండా తటస్థంగా ఉన్న వ్యక్తులు నడిపించినప్పుడే ఉద్యమం కొనసాగుతుందన్న అభిప్రాయాలు కూడా ఆ సామాజిక వర్గం లో వెలువడుతూ ఉండగా, ముద్రగడ స్థానాన్ని దాసరి రాము భర్తీ చేయగలడు అంటూ జోరుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పైగా ఈ రోజు దాదాపు చాలా చానల్స్ లో దాసరి రాము – ముద్రగడ అస్త్రసన్యాసం గురించి, కాపు ఉద్యమ భవిష్యత్తు గురించి చర్చించడం దీనికి బలాన్నిస్తోంది. వివరాల్లోకి వెళితే..
దాసరి రాము- సామాన్య జనానికి పెద్దగా పరిచయం లేని పేరే అయినప్పటికీ, ఆ సామాజిక వర్గానికి, ప్రత్యేకించి కాపు ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నవారి కి సుపరిచితమైన పేరే. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ హయాంలో, ఫీజు రియంబర్స్మెంట్ లో కాపులని కూడా చేర్చాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేయడమే కాకుండా లాబీయింగ్ చేసి మరి డిమాండ్‌ను సాధించిన వ్యక్తిగా దాసరి రాము కి సామాజిక వర్గం లో మంచి పేరు ఉంది. ఆ సామాజిక వర్గానికి చెందిన లక్షలాది మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా ప్రత్యక్షంగా మేలు జరగడం తెలిసిందే. అంతేకాకుండా తుని సభ సమయంలో కూడా ముద్రగడ తోపాటు ఉద్యమంలో దాసరి రాము చురుగ్గా పాల్గొనడం, సభ చివరికంటా అన్ని ఏర్పాట్లను చూసుకోవడం వంటి వాటి కారణంగా దాసరి రాము ఈ ఉద్యమాన్ని నడిపించగలడు అన్న నమ్మకం కూడా ఆ సామాజిక వర్గం లో ఉన్నట్లుగా కనిపిస్తుంది.
దీనికితోడు ముద్రగడ అస్త్రసన్యాసం పై ఈరోజు పలు టీవీ ఛానల్స్ లో మాట్లాడిన దాసరి రాము కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల తర్వాత నుండి ముద్రగడ పై కాపు యువత ఉద్యమాన్ని తిరిగి ఉద్యమం చేపట్టవలసిందిగా పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తున్నారని, గత నాలుగు నెలల్లో ఈ ఒత్తిడి మరీ ఎక్కువ కావడం జరిగిందని దాసరి రాము చెప్పుకొచ్చారు. అయితే ఏవో కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ముద్రగడ ఈ కొత్త ప్రభుత్వ హయాంలో ఉద్యమాన్ని నడిపించడానికి ముందుకు రావడం లేదని దాసరి రాము వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ముద్రగడ కు నిలకడ కలిగిన మనస్తత్వం లేదని ఆయన అన్నారు. 19 94 లో కూడా ఉద్యమం మంచి ఊపు లో ఉన్నపుడు హఠాత్తుగా ఉద్యమాన్ని మానేసి ముద్రగడ వెళ్లిపోయిన సంగతిని దాసరి రాము గుర్తు చేశారు. ముద్రగడ వెళ్లిపోయినంత మాత్రాన కాపు ఉద్యమం ఫేడ్ అవుట్ అయిపోతుంది అనుకోవడం సబబు కాదని ఆయన అన్నారు.
అయితే ఎంతో విషయ పరిజ్ఞానం ఉన్నప్పటికీ, కాపుల లో మంచి గుర్తింపు ఉన్నప్పటికీ, ఉద్యమాన్ని నడిపించగల స్థాయి నాయకత్వ లక్షణాలు దాసరి రాము కి ఉన్నాయా అన్నది ప్రస్తుతానికి సందేహించదగ్గ విషయమే. మరి ఈ నేపథ్యంలో భవిష్యత్తులో కాపు ఉద్యమం కొనసాగుతుందా అన్నది వేచి చూడాలి.