తెలంగాణ సచివాలయం కూల్చివేత శరవేగంగా చేపట్టినా.. న్యాయపరమైన చిక్కులు వచ్చి పడ్డాయి. హైకోర్టు సోమవారం వరకూ.. కూల్చివేతలు ఆపాలని ఆదేశించింది. ఆ రోజున విచారణ జరిపి అనుమతి ఇస్తుందా… మరికొంత కాలం పొడిగింపు ఇస్తుందా.. అన్నది చెప్పడం కష్టం. పిటిషనర్.. కూల్చివేత అక్రమం అని మాత్రమే కాకుండా.. పర్యావరణం లాంటి అంశాలను కూడా పిటిషన్లో చేర్చారు. అదే సమయంలో గతంలో.. కూల్చివేతలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలంటూ.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇది సోమవారం విచారణకు రావాల్సి ఉంది. ఇలాంటి పిటిషన్లు ఏమైనా వేస్తే… తమ వాదనలు వినకుండా.. ఎలాంటి ఆదేశాలు ఇవ్వవొద్దని.. కేవియట్ వేయాలని కేసీఆర్ ఉన్నతాధికారులకు సూచించినట్లుగా ప్రచారం జరిగింది.
ప్రస్తుతం సచివాలయం కూల్చివేత సగం పూర్తయిందని… అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. సగంలో ఆపేస్తే..ఇబ్బందికరమని తర్వాత ప్రభుత్వం వాదనలు వినిపించవచ్చు. అయితే…. సుప్రీంకోర్టులో.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే వస్తే.. మాత్రం… కొంత కాలం పాటు.. కూల్చివేతలకు బ్రేక్ పడే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రభుత్వానికి మరింత చికాకు కల్పించే విషయంగా మారుతుంది. పెద్ద పెద్ద భవనాలను అయినా సరే.. వారంలో కూల్చివేసి.. నెలాఖరు కల్లా.. కొత్త భవన నిర్మాణం పూర్తి చేయాలనుకుంటున్న ప్రభుత్వానికి.. ఈ పరిణామాలు ఇబ్బందికరంగా మారాయి.
కొత్త సచివాలయం కట్టడానికి… కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు.. ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి. మూడేళ్ల నుంచి అనేక రకాల ప్రయత్నాలు చేసిన తర్వాతే.. ప్రస్తుతం కూల్చివేతల వరకూ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూల్చివేతలకు మధ్యలో బ్రేక్ పడితే.. ఆ శిథిలాలు అలా కనిపిస్తూ ఉంటాయి. ప్రభుత్వానికి మరింత ఇబ్బందికరంగా మారతాయి. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయపరమైన చిక్కులను అధిగమించాలని.. ప్రభుత్వ పెద్దలు.. పట్టుదలగా ఉన్నారు.