హైదరాబాద్: కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి, విజయవాడ సీనియర్ రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రూ వైఎస్ఆర్ కాంగ్రెస్‌లోకి చేరటం దాదాపుగా ఖరారైనట్లు జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ విషయంపై జగన్ తన పార్టీ కృష్ణాజిల్లా నేతలతో మంతనాలు చేస్తున్నారు. మరోవైపు దేవినేని నెహ్రూ ఇవాళ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, కాపులపై కేసులను పెట్టగూడదని డిమాండ్ చేయటం విశేషం.
కమ్మ సామాజికవర్గాన్ని ఆకట్టుకోవటానికి జగన్ కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో ఈసారి పెద్దచేపకే గురిపెట్టారు. దేవినేని నెహ్రూను తీసుకురావటానికి పావులు కదుపుతున్నారు. మొన్నీమధ్య ఒక పత్రికా సమావేశంలో జగన్‌ను దీనిపై ఒక విలేకరి ప్రశ్నించగా, “కావాలంటే ఈ క్షణమే తీసుకుంటాం. నీకేమైనా అభ్యంతరమా” అని ఎదురు ప్రశ్నించారు. నెహ్రూకు పార్టీ జిల్లా బాధ్యతలు అప్పజెప్పి, నెహ్రూ తనయుడు అవినాష్‌కు జిల్లాలో ఎక్కడైనా ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని జగన్ ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కూడా ఇటీవల విజయవాడలో నెహ్రూతో సమావేశమై చర్చలు జరిపారు. తనకు కొంత సమయం కావాలని నెహ్రూ చెప్పినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేకపోవటంతో నెహ్రూ వైసీపీలో చేరినా ఆశ్చర్యపోనవసరంలేదు. అయితే ఇప్పటికే వైసీపీలో ఉన్న నెహ్రూ బద్ధ శత్రువు వంగవీటి రాధాకు జగన్ ఎలా సర్ది చెబుతారనేది ప్రశ్నార్థకంగా మారింది. నెహ్రూ వైసీపీలో చేరే విషయమై ఇటీవల రాధాను విలేకరులు అడిగినపుడు అలా జరగదని అతను నమ్మకంగా చెప్పారు. పార్టీలోని ఇతర కాపు నేతలు కూడా నెహ్రూ ఎంట్రీని వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇలాంటి హెచ్చరికలను జగన్ లెక్కచేయరని అంటున్నారు. ఇలాంటి సందర్భాలు ఇతర జిల్లాలలో ఎదురైనపుడు కూడా జగన్ పాత నేతల హెచ్చరికలను లెక్కచేయకుండా కొత్తనేతలకు స్వాగతం పలికారని చెబుతున్నారు. ఏది ఏమైనా నెహ్రూ చేరితే రాధా బయటకు రావటం తథ్యం. కాబట్టి నెహ్రూ, రాధాలలో ఎవరో ఒకరినే జగన్ ఎంచుకోవాల్సి ఉంటుంది.