గత కొంతకాలంగా దిల్ రాజుకి అన్నీ ఆటుపోట్లే. ఈ విషయం ఆయనే గుర్తు చేసుకొన్నారు. ‘వకీల్ సాబ్’ సినిమాని కరోనా దెబ్బకొట్టిందని, ‘బలగం’ తీస్తే తెలంగాణ వాళ్లు మాత్రమే పూర్తి స్థాయిలో ఆదరించారని, ‘ఫ్యామిలీ స్టార్’ డిజాస్టర్ అయ్యిందని ఆయన వాపోయారు. ఓ సమయంలో తన జడ్జిమెంట్ కి ఏమైందన్న బెంగ కూడా వచ్చిందట. తప్పులన్నీ సరిద్దిద్దుకొని మళ్లీ ఓ సూపర్ హిట్ తో కమ్ బ్యాక్ ఇవ్వాల్సిన పరిస్థితిలో ‘గేమ్ ఛేంజర్’ చేశారని, ఈ సినిమాతో తప్పకుండా పునః వైభవం వస్తుందని ఆశపడుతున్నారు దిల్ రాజు.
అయితే గేమ్ ఛేంజర్ విషయంలోనూ ముందు నుంచీ నెగిటీవ్ ప్రోపకాండనే నడుస్తుందన్న విషయం ఆయన గుర్తించారు. నిర్మాతగా తాను ఫ్లాపుల్లో ఉన్నారని, ‘భారతీయుడు 2’తో శంకర్ కూడా డౌన్లోనే ఉన్నాడని, ఒక్క రామ్ చరణ్ తప్ప తమ ప్రాజెక్టులో పాజిటీవ్ విషయాలు లేవని, పైగా నిర్మాతకు శంకర్ క్రియేటీవ్ స్పేస్ ఇవ్వడన్న సంగతి తనకు తెలుసని, అయినా సరే – ఈ సినిమాని హిట్ చేయాలన్న తపనతో శంకర్‌తో కలిసి పని చేశానని గుర్తు చేసుకొన్నారు దిల్ రాజు.
”భారతీయుడు 2’ ఫ్లాప్ తో కంగారు వచ్చింది. కానీ నాలుగేళ్ల క్రితం శంకర్ నాకు చెప్పిన కథపై నమ్మకం ఉంది. చెప్పింది చెప్పినట్టు తీస్తున్నాడా, లేదా అనేది మాత్రమే చూసుకొన్నా. ఈ విషయంలో నూటికి నూరుపాళ్లూ సంతృప్తి వుంది. ఫ్యాన్స్ విజిల్స్ వేసే మూమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. పాటల కోసం భారీగా ఖర్చు పెట్టాం. ఓ విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నాం. ఈ సంక్రాంతికి నాకు నుంచి రెండు సినిమాలొస్తున్నాయి. రెండు సినిమాలతోనూ రెండు సిక్సర్లు కొట్టడం ఖాయం” అని ధీమా ప్రకటించారు.
నిజంగానే దిల్ రాజుకి ఇది కీలకమైన సంక్రాంతి. ‘గేమ్ ఛేంజర్’పై తాను భారీగా ఖర్చు పెట్టాడు. చాలా నెటిటీవ్ అంశాల్ని దాటుకొని మరీ ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాడు. ఏపీలో టికెట్ రేట్లు పెరిగాయి, కానీ పుష్ప 2 స్థాయిలో కాదు. తెలంగాణలో టికెట్ రేట్లు పెరుగుతాయా, లేదా? అనేది అనుమానమే. తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి, పనులు జరిపించుకొనే పరిస్థితి లేదిప్పుడు. ప్రీమియర్లు లేవన్నా, టికెట్ రేట్లు పెరగవన్నా చేసేదేం లేదు. ‘గేమ్ ఛేంజర్’ లాంటి భారీ బడ్జెట్ సినిమాకు టికెట్ రేట్ల విషయంలో వెసులుబాటు అవసరం. ఇన్ని క్లిష్టపరిస్థితుల్లో విడుదల అవుతున్న దిల్ రాజు 50వ సినిమా.. ఆయన కెరీర్లో మైల్ స్టోన్‌గా మిగిలిపోతుందా? లేదంటే గుణపాఠంలా మారిపోతుందా అనేది 10వ తేదీన తెలిసిపోతుంది.