ఫిరాయింపు రాజకీయాలు రాజ్యమేలుతున్న తరుణమిది. కాబట్టి, ఒక నాయుడు లేదా నాయకురాలు పార్టీ మారబోతున్నారు అనే వార్తల్ని పుకార్లుగా తీసి పారేయలేం! తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణపై కూడా ఇలాంటి వార్తలే ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. ఆమె త్వరలోనే కాంగ్రెస్ పార్టీని వదిలి, అధికార పార్టీ తెరాసలో చేరే అవకాశం ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకే ఈ మధ్య ఆమె సైలెంట్‌గా ఉంటున్నారనీ, త్వరలోనే పార్టీ మార్పు ప్రకటన ఉంటుందని తెరాస వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ ఊహాగానాల మధ్య అసలు ట్విస్ట్ ఏంటంటే… అరుణ చేరిక గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత మాట్లాడటం!
డీకే అరుణ త్వరలోనే తెరాసలో చేరతారని కవిత ప్రకటించారు! నిజానికి, ఆమె ఇప్పటికే తెరాసలోకి వచ్చి ఉండాలనీ, కొన్ని కారణాల వల్ల ఆమె చేరిక కాస్త ఆలస్యం అవుతోందని కవిత అభిప్రాయపడ్డారట. దీంతో టి.కాంగ్రెస్ గోంతులో పచ్చి వెలక్కాయ పడింది. అరుణ వ్యవహారంపై ఎలా స్పందించాలో కాంగ్రెస్ నేతలకు అర్థం కాని పరిస్థితి. నిజానికి.. కేసీఆర్ మీద తీవ్రంగా విమర్శలు చేసే కాంగ్రెస్ నేతల్లో ఆమె కూడా ఒకరు. ఈ మధ్య గద్వాల జిల్లా కోసం ఆమె ఎంత పట్టుబట్టారో అందరికీ తెలిసిందే. పాదయాత్ర చేశారు, ఉద్యమించారు, చివరికి రాజీనామా వరకూ వెళ్లారు. దాంతో గద్వాల జిల్లాను కేసీఆర్ సర్కారు ప్రకటించింది. సరిగ్గా అక్కడి నుంచే అరుణ రాజకీయ భవిష్యత్తు కీలకమైన మలుపు తిరిగిందని చెబుతున్నారు. కొత్త జిల్లా ప్రకటించాక ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు అరుణ. ఇప్పుడా కృతజ్ఞతల్ని కూడా వేరే కోణంలో చూడాల్సిన పరిస్థితి!
అరుణ గతంలోనే తెరాసను సంప్రదించారనీ, మంత్రి పదవి ఇస్తే తెరాసలోకి వస్తానని కండిషన్ పెట్టారని చర్చ జరుగుతోంది. అయితే, మంత్రి పదవి ఇచ్చేందుకు తెరాస సంసిద్ధత వ్యక్తం చేయకపోవడంతో తెరాసలో అరుణ చేరిక వాయిదా పడిందని చెబుతున్నారు. డీకే అరుణ సోదరుడు తెరాసలో చేరి చాలాకాలమైన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో కూడా అరుణ తీవ్రమైన ఆరోపణలు చేశారు. తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీకి మోసం చేశాడనీ, ప్రజలు ఆయన్ని క్షమించరని మండిపడ్డారు. మరి, ఇప్పుడు ఆమే స్వయంగా తెరాసలో చేరడం నిజమైతే ఎలా సమర్థించుకుంటారు అనేది అసలు ప్రశ్న? మొత్తానికి అరుణ వ్యవహారం ఇప్పుడు టి.కాంగ్రెస్‌లో హాట్ టాపిక్ అయింది. తెర వెనక ఏదో జరగకపోతే ఎంపీ కవిత ఎందుకిలా మాట్లాడతారు అనేది అసలు ప్రశ్న. ఏదేమైనా, ఇప్పుడు అరుణ మాట్లాడాల్సిన సమయం వచ్చిందని చెప్పాలి. నిజానికి, కొంతమంది నాయకులపై ఇలానే ముందస్తుగా కొన్ని పుకార్లు పుట్టించడం, కథనాలు వచ్చేలా చేయడం తెరాసకు అలవాటైన ఫిరాయింపు రాజకీయం! ఇది కూడా ఆ కోవకు చెందిన వ్యవహారమేనా..?