ఆస్తుల పంచాయతీలో భాగంగా తన సోదరికి తాను రూ. రెండు వందల కోట్లు ఇచ్చానని జగన్ రెడ్డి బయట పెట్టారు. ఇది స్వయంగా ఆయన సంతకంతో చెప్పిన అంశం. ఇప్పుడు ఈ రెండు వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి ? ఎలా ఇచ్చారు ? నగదు రూపంలో ఇచ్చారా ?. ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ చేశారా ? వీటిని తన ఐటీ ఖాతాల్లో చూపించారా లాంటివన్నీ అనేక మందికి వస్తున్న సందేహాలు. వీటిపై జగన్ రెడ్డి కానీ షర్మిల కానీ ఇంకా అధికారికంగా మాట్లాడలేదు.
రెండు వందల కోట్ల లావాదేవీలు అంటే చిన్న మొత్తం కాదు. ఖచ్చితంగా వాటి సోర్స్ ఏమిటో తెలియకుండా చేసి ఉంటే అక్రమ నగదు చెలామణినే. దానిపై ఈడీ వెంటనే రంగంలోకి దిగిపోవచ్చు. ఓ మాజీ ముఖ్యమంత్రి మాత్రమే కాదు పదుల సంఖ్యలో మనీ లాండరింగ్ కేసులు ఉన్న వ్యక్తి తాను రూ. రెండు వందల కోట్లు ఇలా ఓ మనిషికి ఇచ్చానని ప్రకటించుకోవడం చిన్న విషయం కాదు. మరి ఈడీ రంగంలోకి దిగుతుందా ?
ఇచ్చానంటున్న జగన్ రెడ్డిని , తీసుకుందని జగన్ చెబుతున్నషర్మిలను కూడా ఈడీ ప్రశ్నిస్తే ఈ రెండు వందల కోట్ల గుట్టు బయటకు వస్తుంది. అలా వచ్చిందంటే ఐదేళ్ల కాలంలో చేసిన అతి పెద్ద స్కాంలు.. రాష్ట్ర దోపిడికీ సంబందించిన తీగ అధికారికంగా దొరికినట్లే. అందుకే అత్యవసరంగా ఈ అంశంపై ఈడీ రహస్య విచారణ అయినా సరే జరపాలన్న సూచనలు గట్టిగా వస్తున్నాయి. మరి ఈడీకి జగన్ చెప్పిన రెండు వందల కోట్ల గుట్టు తెలుస్తుందా.. లేకపోతే చిన్న చిన్న చేపల కోసమే వేట కొనసాగిస్తుందా.. వేచి చూడాల్సిందే.