టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇటీవల ఆపరేషన్ ఘర్ వాపసీని ప్రారంభించారు. అసంతృప్తితో పార్టీని వీడి పోయిన వారికి బంపర్ ఆఫర్లు ఇచ్చి వెనక్కి పిలుస్తున్నారు. స్వామిగౌడ్, శ్రవణ్ వంటి వాళ్లు చేరారు. ఇలా ఆఫర్లు అందుకున్న వారిలో ఈటల కూడా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన తిరిగి వస్తే పార్టీలో నెంబర్ 2 పొజిషన్ ఇస్తామన్న సంకేతాలను పంపినట్లుగా చెబుతున్నారు.
ఈటల రాజేందర్ బీజేపీలో అసంతృప్తిగా ఉన్నారు. తమ అసంతృప్తిని హైకమాండ్‌కు తెలిసేలా చేస్తున్నారు కానీ ఆ ప్రభావం పార్టీపై పడకుండా జాగ్రత్త పడుతున్నారు. చేరికల ఇంచార్జ్‌గా కూడా ఈటల ఉన్నారు. కానీ చేరికలు… సంప్రదింపులు అన్నీ ఈటలకు సంబంధం లేకుండానే సాగుతున్నాయి. అదే సమయంలో పార్టీలో తమకు ఎలాంటి ప్రాధాన్యం దక్కకుండా.. ఒకరే పెత్తనం చేస్తున్నారని నిర్లక్ష్యం చేస్తున్నారన్న అభిప్రాయంలో ఈటల ఉన్నారంటున్నారు. అయితే తీవ్రంగా అవమానించి పంపేసిన కేసీఆర్ దగ్గరకు ఆయన మళ్లీ వెళ్తారా అన్న సందేహాలు ఎక్కువ మందికి ఉన్నాయి.
ఈటలకు బంపర్ ఆఫర్ ప్రచారం బయటకు రాగానే.. దేవరయాంజల్ భూములపై ప్రభుత్వ కమిటీ నివేదిక ఇచ్చింది. అవన్నీ ప్రభుత్వ భూములేనని వెనక్కి తీసుకోవాలని సిఫార్సు చేసింది. ఇది కూడా ఈటలకు సంకేతమని అంటున్నారు. వెనక్కి రాకపోతే.. ఆ భూములన్నీ వెనక్కి తీసుకుంటామని సంకేతం పంపినట్లేనని అంటున్నారు. ఆ భూముల్లో ఈటలకు చెందిన గోడౌన్లు ఉన్నాయి. కారణం ఏదైనా తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఓ రకమైన ఉద్విగ్న వాతావరణం ఉంది. కొద్ది రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.