ఎన్టీఆర్ బయోపిక్ విడుదల డేట్ మీద యూనిట్ వైపు నుంచి బయ్యర్లకు ఎటువంటి క్లారిటీ లేదు. అది వాస్తవం. ఆ నోటా ఈ నోటా వినిపిస్తున్న మాటలు తప్ప. అధికారికంగా 7వతేదీ అన్నారు. ఆ తరువాత వారం వాయిదా అని వినిపించింది. యూనిట్ నుంచి ఎటువంటి ఖండనా రాలేదు. ఇప్పుడు లేటెస్ట్ గా 22 అని వినిపిస్తోంది. దానికి కూడా ఎటువంటి వివరణ లేదు.
ఇదిలావుంటే, వస్తున్న బయోపిక్ పార్ట్ 2 అనేది పూర్తిగా పొలిటికల్ టచ్ తో వున్న సినిమా. అందులో ఎన్టీఆర్, రాజకీయ ప్రవేశం, ప్రచారం, పోటీ, విజయం, అలాగే గవర్నర్ రామ్ లాల్ వ్యవహారం, మళ్లీ అధికారం, పనిలో పనిగా సంక్షేమపథకాలు. ఇవన్నీ వుండే అవకాశం వుంది.
అయితే ఫిబ్రవరి ఆఖరి వారంలో ఎమ్మెల్సీ ఎన్నికలు వున్నాయి. వాటికి నోటిఫికేషన్ వస్తుందని టాక్ వుంది. అవి ముగిసేలోగా మార్చ్ ఫస్ట్ వీక్ లో శాసన సభ ఎన్నికల కోడ్ వస్తుందని అంచనా.
ఒకవేశ 22న విడదలయితే, వారం తిరిగేలోగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, రెండు వారాలు తిరిగేలోగా ఎమ్మెల్యే ఎన్నికల కోడ్ వస్తుంది. ఎన్నికల టైమ్ లో విగ్రహాలకే ముసుగులు తొడిగేస్తున్న నిబంధనలు మనకు వున్నాయి. మరి అలాంటపుడు ఈ బయోపిక్ కూడా రాజకీయంగా ప్రభావితం చేస్తుందని ఎవరైనా ఏ దిశగా అయినా ప్రయత్నాలు ప్రారంభిస్తే? పరిస్థితి ఏమిటి?
ఎటు నుంచి ఎటు పోయి, ఎలాంటి నిర్ణయాలు వస్తాయి అన్నది మన దగ్గర ఎవ్వరూ ఊహించలేరు. అత్యున్నత అథారిటీ సంస్థలు ఎలా చెబితే అలా ఫాలో కావడం తప్ప, చేసేది ఏమీ లేదు. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఎన్టీఆర్ బయోపిక్ కు అడ్డంకులు లేదా ఆపేసే ప్రయత్నాలు అడ్డం పడక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే కనుక ముందుగా అనుకున్నట్లు జనవరి ఆఖరి వారంలోనో లేదా ఫిబ్రవరి మొదటి వారంలోనో వచ్చేస్తే సమస్య వుండకపోను.
వైఎస్ సినిమా యాత్ర ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోనే వస్తోంది. అందువల్ల కోడ్ తదితర వ్యవహారాలకు కనీసం రెండు వారాలు గ్యాప్ వుంటుంది.