తెలంగాణ బీజేపీ నేతలది ప్రకటనలకు ఎక్కువ.. చేతలు తక్కువ అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఇదిగో చేరికలు.. అదిగో చేరికలు అంటున్నారు కానీ.. వచ్చి చేరేవారు కనిపించడం లేదు. చివరికి కోమటిరెడ్డి కూడా మైండ్ గేమ్ ఆడుతున్నారు. దీంతో చేరికల కమిటీ ఇంచార్జ్ ఈటలకు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఆయన డీకే అరుణతో కలిసి ఢిల్లీ వెళ్లి హైకమాండ్‌కు చేరికలపై ఓ నివేదిక సమర్పించినట్లుగా తెలుస్తోంది. టీఆర్ఎస్ నేతల్ని చేర్చుకుంటే బీజేపీకి నష్టమని.. అందుకే కాంగ్రెస్ నేతల్ని చేర్చుకుందామని అందులో ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని.. ఈ కారణంగా వారిని పార్టీలోచేర్చుకుని టిక్కెట్లు ఇచ్చి నిలబెడితే అది పార్టీకే చేటుచేస్తుందని ఈటల చెబుతున్నట్లుగా తెలుస్తోంది. వారిని ఆహ్వానించకుండా.. క్షేత్ర స్థాయిలో బలంగా ఉన్న ద్వితీయశ్రేణి నేతల్ని ఆహ్వానిద్దామని ఈటల సూచిస్చున్నట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థుల్ని కాంగ్రెస్ పార్టీ నుండి ఆహ్వానిద్దామని ఆయన అంటున్నట్లుగా చెబుతున్నారు. ఈటల ప్రతిపాదనలు ఇప్పుడు తెలంగాణ బీజేపీలో హాట్ టాపిక్ అవుతున్నాయి.
బెంగాల్లో టీఎంసీని చేరికలతో ఇబ్బంది పెట్టినట్లుగా.. తెలంగాణలో టీఆర్ఎస్ను ఇబ్బంది పెట్టాలని…బలహీనపర్చాలని అనుకుంటున్నప్పటికీ అంత వేగంగా ఫలితాలు కనిపించడం లేదు. ఒకరిద్దరు నేతల్ని చేర్చుకున్నా.. చాలా కసరత్తు చేసిన తర్వాతే సాధ్యమవుతోంది. కొంత మంది ఎమ్మెల్యేలను ఆకర్షించాలని చూస్తున్నా.. ఒక్కరూ ముందుకు రావడం లేదు. దీంతో కాంగ్రెస్ నేతలను చేర్చుకుందామని ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు.